SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavya Kalyanram Kala Bhairava: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. 'బలగం' హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

Kavya Kalyanram Kala Bhairava Engagement: ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, యువ గాయకుడు - సంగీత దర్శకుడు కాలభైరవ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 'బలగం' ఫేమ్ నటి కావ్య కల్యాణ్‌రామ్‌ పెళ్లాడనున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి కుటుంబ సభ్యుల మధ్య ఇరువురి నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల అంగీకారంతో వచ్చే డిసెంబర్‌లో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Written By Harish Darla
Published: Nov 07, 2026, 02:36 PM IST | Updated: Nov 07, 2026, 02:46 PM IST
Join

Kavya Kalyanram Kala Bhairava Engagement: టాలీవుడ్‌లో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట శుభకార్యం ఘనంగా జరిగింది. ఆయన పెద్ద కుమారుడు, యువ గాయకుడు, సంగీత దర్శకుడైన కాలభైరవ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. 'బలగం' చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కావ్య కల్యాణ్‌రామ్‌తో ఆయన నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా ముగిసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రాజమౌళి దంపతుల ఆశీస్సులు..
ఈ నిశ్చితార్థ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. సంప్రదాయ దుస్తులలో మెరిసిన కాలభైరవ, కావ్యల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుక చిత్రాలు బయటకు రావడంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వీరిద్దరి కెరీర్ విషయానికొస్తే.. కాలభైరవ తన తండ్రి బాటలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు, కావ్య కల్యాణ్‌రామ్ బాలనటిగా కెరీర్ ప్రారంభించి, 'మసూద', 'బలగం' వంటి చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా 'బలగం' సినిమాలో ఆమె కనబరిచిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

డిసెంబర్‌లో ఘనంగా వివాహం?
ఇరు కుటుంబాల అంగీకారంతో జరగనున్న వీరి వివాహాన్ని డిసెంబర్ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి తేదీ, వేదిక వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం చేసుకోగా, హీరో తేజ సజ్జా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో కాలభైరవ, కావ్యల వివాహ వార్తతో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES