Murali Mohan: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలు, నెగెటివిటీ గురించి కూడా మాట్లాడారు.
ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి..
తనకు మొదటి నుంచి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని మురళీమోహన్ తెలిపారు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, గౌరవం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయనకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అప్పట్లో తెలుగు ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాల్లో మద్రాసీలుగా పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, వారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటాలని ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఆయన ఆశయాలు నచ్చడంతో రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించానని వివరించారు.
యువతకు మురళీమోహన్ సలహా..
రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలని మురళీమోహన్ సూచించారు. డబ్బు సంపాదించడానికి, పేరు తెచ్చుకోవడానికి రాజకీయాల్లోకి రావడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.
ఓటుకు డబ్బులు తీసుకోవద్దు..
2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ప్రశ్నకు ఆయన నేరుగా ఎవరి పేరును చెప్పలేదు. అయితే ఓటు విలువ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ప్రజలే తమ హక్కులను కోల్పోతారని అన్నారు.
ఓటుకు డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే జీవితాంతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాసేవ చేయగల అర్హత ఉన్న నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని సూచించారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.