పాన్ ఇండియా మోజులో టాలీవుడ్! హైప్ ఎక్కువ..! కంటెంట్ తక్కువ..!
Pan India Telugu Movies: టాలీవుడ్‌లో ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు.. ఆ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడం మరో ఎత్తు. స్టార్ హీరోలు.. క్రేజీ కాంబినేషన్లు.. వందల కోట్ల బడ్జెట్లు.. దేశ వ్యాప్తంగా భారీ ప్రచారాలు! సినిమా విడుదల కాకముందే రికార్డుల గురించి చర్చలు మొదలవుతున్నాయి. టీజర్ వస్తే సెన్సేషన్.. ట్రైలర్ వస్తే ఇండస్ట్రీ షేక్.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే బాక్సాఫీస్ దగ్గర సునామీ అంటూ హడావుడి కనిపిస్తోంది.
Pan India Movies Not Work Out: బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. దీంతో తెలుగులో బడా హీరోలు నేల విడిచి సాము చేసినట్టుగా అన్ని ప్యాన్ ఇండియా చిత్రాలనే ప్రేక్షకులపై ఒదులుతున్నారు. దీంతో కొన్ని చిత్రాల్లో నేటివిటి లాంటివి మిస్ కావడం వల్ల ఈ చిత్రాలు పెద్దగా ఆడటం కాదు. మెయిన్ మార్కెట్ అయిన హిందీలో కనీస వసూళ్ల రాబట్టడం లేదు.
కానీ అసలు సినిమా థియేటర్లలోకి వచ్చాకే అసలైన పరీక్ష మొదలవుతోంది. ప్రేక్షకులకు సినిమా నచ్చితే ప్రశంసలు.. అంచనాలను అందుకోలేకపోతే విమర్శలు.. మధ్యలో సోషల్ మీడియా ట్రోల్స్! దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినిమాలను ప్రమోట్ చేస్తున్నామా? లేక సినిమాలపై అంచనాలను మాత్రమే పెంచుతున్నామా?
ఒకప్పుడు సినిమా అంటే కథ ఏంటి? హీరో ఎలా నటించాడు? దర్శకుడు ఎంత బాగా తెరకెక్కించాడు? అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగేది. అంతేకాదు ఒకపుడు నిర్మాతలు కథ రెడీ చేసుకున్నా.. ఆ సబ్జెక్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత హీరో ఎవరనేది ఎంపిక చేసేవారు. కానీ స్టార్ హీరోల విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. వాళ్లే దర్శకులను నిర్మాతలను ఎంపిక చేసే స్థాయికి పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై ఎవరు పెదవి విప్పరు.
ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే హైప్ మొదలవుతోంది. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ కుదిరితే చాలు.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతి అప్‌డేట్‌ను భారీ ఈవెంట్‌లా ప్రమోట్ చేస్తున్నారు.
నేల విడిచి సాము..
అయితే ఈ హడావుడిలో అసలు కథకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ప్రచారం చేయడం అవసరమే. కానీ థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసే కథ, బలమైన స్క్రీన్‌ప్లే కూడా అంతే ముఖ్యం. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్లు సినిమాకు ఆకర్షణ తీసుకురావచ్చు. కానీ అవే సినిమాను విజయతీరాలకు చేర్చుతాయనుకోవడం పొరపాటే!
ఇక పాన్ ఇండియా మార్కెట్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపైనా చర్చ నడుస్తోంది. తెలుగు సినిమా పరిధి దేశవ్యాప్తంగా విస్తరించడం మంచి పరిణామమే. మన కథలు, మన హీరోలు ఇతర భాషల ప్రేక్షకులకు చేరువవుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమా అంటే ఎక్కువ భాషల్లో విడుదల చేయడం మాత్రమే కాదు.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరినీ కథతో కనెక్ట్ చేయడం కూడా. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘పెద్ది’, ప్యారడైజ్’ రణబాలి చిత్రాలు పేరుకు ప్యాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కాయి. తీరా వేరే భాషల్లో ఈ సినిమాలు కనెక్ట్ కాలేక కేవలం తెలుగుకే పరిమితం అయ్యాయి.
మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సినిమా ఫలితాల చర్చలో కీలకంగా మారింది. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు, ప్రేక్షకుల అభిప్రాయాలు, మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు మరింత ప్రచారం లభిస్తోంది. ఇది బోనస్ అని చెప్పాలి. అదే మిక్స్‌డ్ టాక్ వస్తే మాత్రం ప్రమోషన్లలో చూపించిన స్థాయికి, తెరపై కనిపించిన కంటెంట్‌కు మధ్య తేడా ఉందా? అంటూ ప్రశ్నలు రెయిజ్ అవుతాయి.
అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌ను ప్రేక్షకుల తుది తీర్పుగా చూడలేం. నిజమైన సినిమా ఫలితాన్ని అంచనా వేయాలంటే ప్రేక్షకుల స్పందన, వసూళ్లు, సినిమా ప్రదర్శన కొనసాగుతున్న తీరు.. అన్నింటినీ పరిశీలించాల్సిందే!
ముఖ్యంగా నిర్మాతలకు ఇప్పుడు అసలైన సవాల్ బడ్జెట్‌ను పెంచడం కాదు.. పెట్టిన పెట్టుబడికి తగిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. అది ప్రాంతాల వారికీ కనెక్ట్ కావడం అనేది ఇంపార్టెంట్. మార్కెటింగ్ సినిమాకు ఓపెనింగ్స్ తీసుకురావచ్చు. స్టార్ ఇమేజ్ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించవచ్చు. కానీ సినిమా బాగుంటేనే ప్రేక్షకులు మరొకరికి సిఫార్సు చేస్తారు. అదే సినిమాకు లాంగ్ రన్ తీసుకొచ్చే అసలైన బలం.
మొత్తానికి టాలీవుడ్‌లో హైప్ అవసరమే.. ప్రమోషన్లు తప్పనిసరే! కానీ వాటితోపాటు కంటెంట్‌కు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పోస్టర్లు ఎంత గొప్పగా ఉన్నా.. ట్రైలర్లు ఎన్ని రికార్డులు సృష్టించినా.. చివరకు థియేటర్‌లో ప్రేక్షకుడికి కలిగే అనుభూతే సినిమాకు అసలైన కొలమానం.