SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్న ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్..

Tollywood Directors Powerful Comebak: ఒకప్పుడు మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఓ డిజాస్టర్ తర్వాత నెక్ట్స్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఎవరైనా హీరో తమకు అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్నారు. డిజాస్టర్స్ తర్వాత ఖాళీ అయిపోయిన డైరెక్టర్స్.. ప్రూవ్ చేసుకోడానికి వన్ లాస్ట్ ఛాన్స్ కావాలి.. అది దొరుకుతుందా..? హీరోలు అసలు వీళ్లను నమ్మి సినిమా ఇస్తారా..? నిర్మాతలు వీళ్లను నమ్మి కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 06:29 AM IST | Updated: Oct 12, 2026, 06:30 AM IST
Image Credit: Directors Last Chance (File pics/Source)
Join

Craze Directors Last Chanse Please: అవును ఒకప్పుడు ఈ దర్శకుల నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్ అటెన్షన్ ఉండేది. గతం ఎంత ఘనమైనా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే మంచి సక్సెస్ ఉండాలి. ఇపుడు ఈ దర్శకుడు తమ లాస్ట్ డిజాస్టర్ తర్వాత అసలు కనబడకుండా పోయారు.

హరీష్ శంకర్.. 
తెలుగులో ‘గబ్బర్ సింగ్’తో దర్శకుడిగా తన టాలెంట్‌ను చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా హిట్ కోసం ముఖం వాచిపోయిన పవన్ కళ్యాణ్‌కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఓ రకంగా పవన్ అభిమానులకు అభిమాన ప్రాతుడైన దర్శకుడు అయిపోయాడు. ఆ తర్వాత ఈ రేంజ్ సక్సెస్ ఇతనికి అందని ద్రాక్ష అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక అల్లు అర్జున్‌తో చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ (డీజే) పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్, పవన్ కళ్యాణ్‌‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి ఫ్లాప్‌గా నిలవడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన్ని నమ్మి సినిమాలు ఇచ్చే హీరో ఎవరనేది చూడాలి. దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే మంచి సబ్జెక్ట్‌తో పాటు అంతకు మించి మంచి కాంబినేషన్ సెట్ కావాలి.

సురేందర్ రెడ్డి..

‘అతనొక్కడే’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది  ఇండస్ట్రీగా మారాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన అశోక్, ఊసరవెల్లి సినిమాలు బాగున్నా.. ఎందుకో బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. ఇక మహేశ్ బాబుతో చేసిన ‘అతిథి’ కూడా డిజాస్టర్ అయింది. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘రేసుగుర్రం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో చేసిన ‘ధృవ’ సినిమా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా తమిళ సినిమా ‘తని ఒరువన్’ మూవీకి రీమేక్.  ఆ తర్వాత చిరంజీవితో చేసిన పీరియాడిక్ డ్రామా‘సైరా నరసింహారెడ్డి’  తెలుగులో తప్పించి ఎక్కడా పెద్దగా ఆడింది లేదు. ఆ తర్వాత అఖిల్‌తో చేసిన ‘ఏజెంట్’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ. ఈ సినిమా దెబ్బతో అఖిల్ కెరీర్‌ పాతాళంలోకి పడిపోయింది. దాన్నుంచి బయట పడటానికి చాలా టైమ్ పట్టింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డిని పిలిచి ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అని చూడాలి. అయితే పవన్ కళ్యాణ్.. ‘యథా కాలం తథా వ్యవహారం’ సినిమా అనౌన్స్ అయిన ఇప్పటికీ దాని అతాపతా లేదు.

పరశురామ్ పేట్ల..

పరశురామ్ తెలుగులో ‘యువత’ అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఒక్కసారిగా పరశురామ్ క్రేజ్ పడిపోయింది. ప్రస్తుతం ఇతను బాలీవుడ్ ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత మేర నిజం ఉందో చూడాలి.

శ్రీకాంత్ అడ్డాల..

తెలుగులో ‘కొత్త బంగారులోకం’ సినిమాతో పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల.. ఆ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు వంటి హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె  చెట్టు’ వంటి లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘పెదకాపు’ సినిమాతో పలకరించాడు. కానీ ప్రయోజనం శూన్యం. ఈ సినిమా వచ్చిన సంగతే చాలా మందికి తెలియదు. ఓ రకంగా నెక్ట్స్ తనను నమ్మి ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని చూస్తున్నాడు.

వి.వి.వినాయక్..

వి.వి.వినాయక్ తెలుగులో యాక్షన్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వి.వి.వినాయక్.. చివరగా ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో పలకరించాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ మూవీతో పెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. ఇక బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’ రీమేక్‌ను అదే టైటిల్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ దక్కలేదు. ఈ సినిమా తర్వాత తను నమ్మి ఎవరైనా డైరెక్షన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు.


కళ్యాణ్ కృష్ణ కురసాల.. 

అందరికీ ఫ్లాపుల వల్ల చాన్సులు రావడం లేదనుకుంటే.. కళ్యాణ్ కృష్ణకు మాత్రం బంగార్రాజు వంటి సక్సెస్ ఉన్న అవకాశాలు రావడం లేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా  బంగార్రాజు సినిమాలు హిట్టైన కళ్యాణ్ కృష్ణను నమ్మి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తలేరనే చెప్పాలి. అయితే సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలను  కళ్యాణ్‌ కృష్ణను పెట్టుకొని నాగార్జున డైరెక్షన్ చేసాడనేది కొందరు చెబుతున్న మాట. ఏది ఏమైనా ఈ దర్శకులు మాత్రం నెక్ట్స్ సినిమా ఛాన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES