Anirudh Ravichander And Kavya Maran Wedding: ఎన్నాళ్లుగానో పుకార్లతో పలుమార్లు పెళ్లి చేసుకున్న సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సినీ నిర్మాత కుమార్తె కావ్య మారన్ ఎట్టకేలకు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లిపై కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు గుప్పుమంటూ వస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోలేదు. నాడు వచ్చిన వార్తలు నేడు నిజమవుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. విదేశాల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివెళ్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ నిర్మాత కళానిధి కుమార్తె 34 ఏళ్ల కావ్య మారన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కొనసాగిస్తూనే తండ్రి వ్యాపార సామ్రాజ్య బాధ్యతలు చేపడుతున్నారు. ఇక 36 ఏళ్ల అనిరుధ్ భారతదేశ ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. గతంలో కళానిధి నిర్మాతగా వ్యవహరించిన సినిమాలకు అనిరుధ్ పనిచేశాడు. అప్పటి నుంచి మారన్ కుటుంబంతో అనిరుధ్‌కు చక్కటి అనుబంధం కొనసాగుతోంది. ఆ అనుబంధం కాస్త బంధుత్వంగా మారింది. కావ్య మారన్, అనిరుధ్ కుటుంబాలు వారిద్దరు పెళ్లిని నిశ్చయించారు.
వీరి వివాహం గ్రీస్ దేశంలో డెస్టినేషన్ తరహా జరగనుండగా.. స్వదేశం భారత్‌లో వివాహ విందు జరగనుంది. వివాహానికి కొద్ది మంది బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు మాత్రమే హాజరుకానుండగా.. చెన్నైలో ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున నవంబర్ 21వ తేదీన రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు భారతదేశంలోని ప్రముఖులందరూ తరలివచ్చే అవకాశం ఉంది. సినీ, క్రీడా రంగంతోపాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు.
కావ్య, అనిరుధ్ వివాహం కోసం తమిళ సినీ ప్రముఖులు రజనీకాంత్‌తోపాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబాలు గ్రీస్ దేశానికి పయనమయ్యారు. ఈ పెళ్లికి మరింత మంది ప్రముఖులు తరలివెళ్లనున్నారు. కాగా వీరి వివాహ విందుకు (రిసెప్షన్) హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు కూడా కావ్య, అనిరుధ్ కుటుంబాలు ఆహ్వానించాయి. తెలంగాణ, ఏపీ సీఎంలతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కావ్య మారన్ కుటుంబం ఆహ్వానం పలికింది. స్వయంగా కావ్య తండ్రి హైదరాబాద్‌లో పర్యటించి అందరికీ లగ్నపత్రిక పంచిపెట్టారు. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల సీఎంలతోపాటు కేటీఆర్, ఇతర రాజకీయ ప్రముఖులు తరలివెళ్లనున్నారు.