Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!
Vivek Oberoi: సినిమాల్లో విలన్‌గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన నటనకు వచ్చిన భారీ పారితోషికాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకుండా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో వివేక్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
Vivek Oberoi: ప్రస్తుతం రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణం' సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన విద్యుత్ జిహ్వుడు అనే రాక్షసుడి పాత్రను పోషించారు. ఇతడు రావణుడి బావమరిది మాత్రమే కాకుండా శూర్పణఖ భర్త కూడా. ఈ పాత్ర కోసం వివేక్‌కు సుమారు రూ. 6 కోట్ల పారితోషికం లభించినట్లు సమాచారం.
అయితే ఈ మొత్తాన్ని తన దగ్గర ఉంచుకోవడానికి వివేక్ ఇష్టపడలేదు. క్యాన్సర్‌తో పోరాడుతున్న పేద పిల్లల వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ. 6 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ మొత్తాన్ని నేరుగా చిన్నారుల చికిత్స కోసం ఉపయోగించాలని సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రాను కూడా కోరినట్లు కథనాలు చెబుతున్నాయి.
ఇక్కడితో ఆయన సేవ ఆగిపోలేదు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 మంది పేద పిల్లల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఎంతో మంది కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తోంది.
ఈ విషయంపై వివేక్ మాట్లాడుతూ చిన్నారుల బాధను తగ్గించడానికి తన వంతు సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పినట్లు సమాచారం. ఇలాంటి మంచి పని చేయగలిగితే అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఇక రామాయణంలో ఆయన పోషించిన విద్యుత్ జిహ్వుడు పాత్ర కూడా కథలో కీలకమైనది. రావణుడితో జరిగిన యుద్ధంలో విద్యుత్ జిహ్వుడు మరణిస్తాడు. భర్తను కోల్పోయిన శూర్పణఖ అడవుల్లోకి వెళ్లిన తర్వాతే రాముడిని కలుస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు రామాయణ కథను కీలక మలుపు తిప్పుతాయి.
తెరపై ప్రతినాయకుడిగా కనిపించే వివేక్ నిజ జీవితంలో మాత్రం చిన్నారులకు అండగా నిలుస్తున్నారనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అభిమానులు ఆయనను నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.