Shaik haseena Statement:బంగ్లాదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో గత 24 గంటల్లో 11 జిల్లాల్లో కనీసం 22 వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని ఢాకాతో పాటు మరో ఆరు జిల్లాల్లోని వివిధ ప్రదేశాలలో కనీసం 28 నాటు బాంబు పేలుళ్లు కూడా నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నట్లు షేక్ హసీనా ప్రకటించిన తర్వాతే ఈ హింస మొదలైంది. దాడులు, రహదారి దిగ్బంధనాలు, దహనకాండ ఘటనలకు అవామీ లీగ్, దాని విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ కార్యకర్తలే కారణమని పోలీసులు వెల్లడించారు.
ఢాకా, పొరుగు జిల్లాల్లో అత్యంత ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజధానిలోని ఫార్మ్‌గేట్ మెట్రో స్టేషన్ కింద నిలిపి ఉంచిన ఒక బస్సుపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీర్‌పూర్-11లోని పోస్ట్ ఆఫీస్, మెట్రో రైలు మార్గం సమీపంలో మరో బస్సును తగలబెట్టగా, పల్లబి ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన రెండు బస్సులకు కూడా నిప్పు పెట్టారు.
వాహనాలకు నిప్పు..
ఫరీద్‌పూర్‌లో ఒక వాహనానికి నిప్పు పెట్టడంతో 55 ఏళ్ల బస్సు డ్రైవర్ మరణించాడు. దేశానికి తిరిగి వస్తున్నానన్న హసీనా ప్రకటన తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించి పలువురని అదుపులోకి తీసుకుంటున్నారు.
కోర్టులో లొంగిపోనున్న హసీనా..
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోవాలని హసీనా భావిస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ తేదీని వెల్లడిస్తారని ఆమె సహాయకులు తెలిపారు. అయితే కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు కోసం చేసిన విజ్ఞప్తిపై బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం ఆసక్తికరంగా మారింది.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో ఉద్యోగుల్లో స్వాతంత్య్ర సమరయోధుల పిల్లలకు రిజర్వేషన్ల అంశం చిలికి చిలికి గాలివానగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం అలో లక్ష్మణ అంటూ భారత్‌కు పారపోయివచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే శరణులోనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె పాలనకు విద్యార్థి ఉద్యమం ముగింపు పలికింది.