8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2027లో భారీగా పెరగనున్న జీతాలు..?
8th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై కొత్త సంవత్సరంలో క్లారిటీ రానుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది..? జీతాలు పెరుగుతాయి..? వంటి ప్రశ్నలకు వచ్చే ఏడాది సమాధానాలు రానున్నాయి.
8th Pay Commission Latest Update: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న అధికారికంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చింది. ఈ లెక్కన 2027 మే నాటికి కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఎలాంటి మార్పులు చేయాలనే అంశాలను కమిషన్ పరిశీలిస్తోంది.
కమిషన్ నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగుల జీతాల పెంపు అమల్లోకి రాదు. నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందులోని సిఫార్సులను పరిశీలించాల్సి ఉంటుంది. వాటిని ఆమోదించడంతో పాటు అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీ చేయాలి. కేబినెట్‌లో చర్చించి.. మార్పులు చేర్పులు తరువాత సిఫార్సులు అమల్లోకి వస్తాయి. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.. 2027 రెండో అర్ధభాగంలో లేదా ఆ తర్వాత ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
8వ వేతన సంఘం విషయంలో 2026 జనవరి 1వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తున్నాయి. గతంలో 7వ వేతన సంఘం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే 8వ వేతన సంఘం సిఫార్సులు కూడా 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త వేతనాలు అందే తేదీ, సిఫార్సుల అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
కొత్త వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తే.. ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే సిఫార్సుల అమలు ఆలస్యమైనా.. ఆ తేదీ నుంచి కొత్త జీతాలు అందే వరకు అరియర్స్ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొత్త వేతనాలు 2027 ద్వితీయార్థంలో సిఫార్సులు అమల్లోకి వస్తే.. 2026 జనవరి 1 నుంచి అమలు తేదీ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు ఉద్యోగులకు అందే అవకాశం ఉంటుంది.
ఉద్యోగుల వేతనాలు ఎంతమేర పెరుగుతాయనే విషయాన్ని నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బేసిక్ పేను ఈ గుణకంతో లెక్కించి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. అయితే 8వ వేతన సంఘానికి సంబంధించిన తుది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా చూస్తే 2027 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకంగా మారనుంది. కమిషన్ నివేదిక, ప్రభుత్వ ఆమోదం, అమలు తేదీ ఖరారైన తర్వాతే జీతాల పెంపుపై పూర్తి స్పష్టత రానుంది. అప్పటివరకు ఉద్యోగులు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సిందే.