రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం సిఫార్సులపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో రక్షణ శాఖలోని సివిలియన్ ఉద్యోగుల నుంచి కీలక ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం రూ.30 వేలుగా ఉన్న గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీని ఏకంగా రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘం కోరుతోంది.
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కొత్త పే కమిషన్ సిఫార్సుల కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు పెడుతున్నాయి. ఈ క్రమంలో రక్షణ శాఖ పరిధిలో పనిచేసే సివిలియన్ ఉద్యోగుల తరఫున భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) 73 ప్రతిపాదనలను 8వ వేతన సంఘానికి సమర్పించింది. వీటిలో ఉద్యోగుల బీమా మొత్తాన్ని భారీగా పెంచాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) కింద లభిస్తున్న బీమా కవరేజీ చాలా తక్కువగా ఉందని.. ఈ మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.30 వేల నుంచి కనీసం రూ.15 లక్షలకు పెంచాలని కోరింది. ఉద్యోగికి అనుకోని పరిస్థితి ఎదురైతే అతడి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే బీమా రక్షణ పెరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసింది.
అంతేకాదు.. ఉద్యోగి మరణించిన సందర్భంలో అతడి కుటుంబానికి అందించే డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (DLI) ప్రయోజనాన్ని కూడా రూ.10 లక్షలకు పెంచాలని సంఘం కోరింది. తద్వారా ఉద్యోగుల కుటుంబాలకు మరింత మెరుగైన ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొంది. బీమాతో పాటు ఉద్యోగుల వేతనాల విషయంలోనూ సంఘం పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని కోరింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు అవసరమని అభిప్రాయపడింది.
అదేవిధంగా ప్రస్తుతం లభిస్తున్న డీఏలో 50 శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలని ప్రతిపాదన పంపించింది. దీంతో కొత్త వేతన నిర్మాణంలో ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని సంఘం భావిస్తోంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC) నిబంధనలు, ఎక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనాన్ని ఖరారు చేయాలని కోరింది.
ఆహారం, దుస్తులు, నివాసం, కుటుంబ నిర్వహణకు అయ్యే వాస్తవ ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని తెలిపింది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘం 8వ వేతన సంఘం ముందు ఉంచిన ప్రతిపాదనలు మాత్రమే. వీటికి కమిషన్ ఇంకా ఆమోదం తెలిపినట్లు కాదు. కమిషన్ సిఫార్సులు, తదుపరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగానే ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, బీమా ప్రయోజనాలపై క్లారిటీ రానుంది.