Assam Night Club Incident Video: అస్సాం రాష్ట్రం గువాహటిలోని ఖానాపారా ప్రాంతంలోని 'లోకల్స్' కేఫ్ అండ్ లాంజ్ నైట్‌క్లబ్‌లో గురువారం అర్ధరాత్రి ఒక యువతిపై అమానుష దాడి జరిగింది. క్లబ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది (బౌన్సర్లు) ఈ దారుణమైన ఘటనకు పాల్పడినట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో పురుష, మహిళా బౌన్సర్లు ఇద్దరూ కలిసి ఆమెను నేలపైకి నెట్టి, దుస్తులు తొలగించి నగ్నంగా ఆమెను వేధించారని సమాచారం అందుతోంది.
వైరల్ వీడియో దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. బాధితురాలు నేలపై దుస్తులు లేకుండా నగ్నంగా పడిఉంది. ఇద్దరు మహిళలు ఆమెపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో వారిద్దరి చుట్టూ కొందరు పురుషులు గుమిగూడి కనిపించారు.
మరొక వీడియోలో.. ఒక మహిళ బాధితురాలిని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా, ఒక కారు వచ్చి వారి దృశ్యాన్ని అడ్డుకోవడం కనిపిస్తుంది. అయితే ఆమెపై దాడిని ప్రతిఘటించడానికి కొందరు ప్రయత్నించినా.. బాధితురాలిపై బౌన్సర్ల దాడి ఆపలేదు.
ఆ దాడి అనంతరం బాధితురాలిని క్లబ్‌లోని నాలుగవ అంతస్తు నుండి పార్కింగ్ ప్రదేశంలా కనిపిస్తున్న కింది ప్రాంతానికి తీసుకువచ్చిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. అయితే, ఈ గొడవ ఆ తర్వాత ఈ ఘర్షణ ఎందుకు జరిగింది? దాడికి ముందు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అలాగే బాధితురాలికి సంబంధించిన పూర్తి వివరాలను మరిన్ని బయటకు రావాల్సిఉంది.
పోలీసు దర్యాప్తు, ప్రస్తుత పరిస్థితి..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు సదరు నైట్‌క్లబ్‌కు చేరుకునే సమయానికి.. అప్పటికే దాని నిర్వాహకులు మూసివేసినట్లు తేలింది. అదే సమయంలో క్లబ్‌లోని లైట్లు ఆపేసి ఉండడంతో మేనేజ్‌మెంట్ నుంచి ఎవరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నైట్ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.