ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు..
Central Government Issues Key Directions to TV Channels: దేశంలోని అన్ని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు, న్యూస్ మరియు ఎంటర్టైమన్మెంట్ ఛానెల్స్ అన్ని ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే పలు ఛానెళ్లలతో నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యక్రమాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Private News Channels Key Directions: ప్రస్తుతం కేంద్ర దగ్గర దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు సంబంధించి వేల ఛానెల్స్ రిజిస్టర్ అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే సరైన నియమ నిబంధనలు పాటిస్తున్నట్టు కేంద్రం దృష్టికి వచ్చింది. మిగిలిన ఛానెల్స్ ఏవి కేంద్ర నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం లేదు. ఇప్పటికే పలు ఛానెల్స్‌లో దేశ సార్వభౌమాత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ ప్రసారమవుతున్నట్టు వాళ్ల దృష్టికి వచ్చింది. దీంతో కేంద్రం దేశంలోని అన్ని ప్రైవేట్ ఛానెల్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఇప్పటికే నిర్ధేశించిన వాటికి భిన్నంగా ఛానెల్స్ ఇకపై ఉల్లంఘనలకు పాల్పడితే కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల చట్టం, 1995, 1994 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాధ్యతాయుతమైన జర్నలిజం నిర్వహించడం. అసభ్యకరమైన ప్రవర్తన, అనుచిత భాషను టీవీ షోలలో ప్రసారం చేయొద్దని తేల్చిచెప్పింది.
యాంటీ టెర్రర్ ఆపరేషన్లను లైవ్ టెలికాస్ట్ చేయొద్దు: కేంద్రం..
అంతేకాదు దేశ భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను లైవ్ టెలికాస్ట్ కాస్ట్ చేయడాన్ని పూర్తిగా నివారించాలన్నారు. హింసాత్మక దృశ్యాలను ప్రదర్శించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆదేశించింది.
రెచ్చగొట్టే డిబేట్లు వద్దు..ఏఐ వాడకంలో జాగ్రత్త: కేంద్రం
అలాగే, లైంగిక వేధింపుల బాధితుల గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దని హెచ్చరించింది. వివిధ దేశాలు నిర్దేశించిన మ్యాపులను కాకుండా దేశ అధికారిక మ్యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఛానెళ్లలోని చర్చలు, ప్యానెల్ డిబేట్లు మతతత్వ, దేశ వ్యతిరేక వైఖరులను రెచ్చగొట్టేలా ఉండకూడదని తన ఆదేశాల్లో పేర్కొంది.
వార్తల ఖచ్చితత్త్వం..
వార్తల ప్రసారాలు, గ్రాఫిక్స్, వర్చువల్ ప్రజెంటేషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రసారకర్తలకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. వార్తల ఖచ్చితత్వం, ప్రామాణికత, సున్నితత్వానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఏఐ సాధనాలను కేవలం సహకార మాధ్యమంగా మాత్రమే పరిమితం చేయాలన్నారు. సాంకేతికత పేరిట ఫేక్, తప్పుదారి పట్టించే వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేయవద్దని తేల్చి చెప్పింది.
ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ సమావేశంలో వచ్చిన సిఫార్సుల మేరకు, కంటెంట్ నాణ్యతను కాపాడేందుకు మీడియా సంస్థలు తమ అంతర్గత సంపాదకీయ సమీక్షా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలని సూచనల చేసింది. ముఖ్యంగా వార్తల సేకరణ, ఎడిటింగ్, ప్రొడక్షన్, ప్రసార విధుల్లో ఉన్న సిబ్బందికి చట్టబద్ధమైన నిబంధనలపై క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించే ప్రసారాలపై కేంద్రం కఠిన చర్యలతో పాటు వాళ్ల ఛానెల్ లెసెన్స్ రద్దు చేస్తామని చెప్పుకొచ్చింది.