Rahaul Gandhi Rally: దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది ప్రజలతో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఓటీ చోరీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే దాదాపు 30 వేల మంది కెపాసిటీ ఉండే రాంలీలా మైదాన్‌లో 10 లక్షల జనంతో కాంగ్రెస్ పార్టీ ఎలా ధర్నా చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక,తెలంగాణ, కేరళల నుంచి ప్రజలను కార్యకర్తలను ఢిల్లికి తరలించే ప్రక్రియను స్థానిక కాంగ్రెస్ నేతలు చేపట్టారు.
ఛలో ఢిల్లీ..
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారంతా ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ రాంలీలా మార్చ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ర్యాలీని రాంలీలా మైదాన్ నుంచి కాకుండా కన్నాట్ ప్లేస్ నుంచి ప్రారంభించి రాంలీలా మైదాన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నట్టు సమాచారం. అయితే పండగ వేళ రాహుల్ గాంధీ ధర్నా చేయవద్దని అక్కడ వ్యాపార వర్గాలు చెబుతున్నా.. పెడచెవిన పెట్టి మరి రాహుల్ గాంధీ ఈ ధర్నా చేస్తున్నారు.
ఓటు చోరీని అడ్డుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించిన ఉద్యమమని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఈజీ జ్ఞానేశ్ కుమార్‌లపై అసంతృప్తితో ఉన్నవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునేవారు ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలీసులు, వారి లాఠీలకు భయపడకుండా ర్యాలీలో పాల్గొనలని పిలుపు నిచ్చారు.
మాక్ పార్లమెంట్..
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసిస్తూ ఇండి కూటమి నేతల మాక్ పార్లమెంట్ తీర్మానించింది. పార్లమెంటులో తమకు తగిన అవకాశం దక్కలేదనే కారణంతో, సామాన్య ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ మాక్ పార్లమెంట్‌కు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వయంగా పబ్లిక్ ఇంపీచ్‌మెంట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు, ఓట్ల తొలగింపు, ఈవీఎంల విషయంలో సీఈసీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఖర్గే ఆరోపించారు.
దేశానికి స్వాతంత్ర్యం రాగానే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఏకైక దేశం భారత్ అని గుర్తుచేశారు. కుల, మత, పేద, ధనిక భేదం లేకుండా అన్ని వర్గాలకు నాడు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పించిందన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ ఓట్లను అక్రమంగా తొలగిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అని కూటమి ఎంపీలంతా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇండి కూటమికి చెందిన పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవడానికి తాము ఈ పోరాటం చేస్తున్నట్లు విపక్ష నేతలు స్పష్టం చేశారు.