అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..
Heavy Rains Chennai:దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తమిళనాడు తీర ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ద్రోణి కారణంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tamil Nadu Rains: తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. చెన్నైలోని మీనంబాకం లో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, నుంగంబాకంలో 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల మరో రెండు మూడు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ..
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారడంతో పాటు ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సీఎం జోసెఫ్ విజయ్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిన్న సందర్శించి నగరవ్యాప్త పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని తెలిగించిన అధికారులు..
మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని 35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని మోటార్ పంపుల ద్వారా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలగించింది. అలాగే 22 ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగించి, నగరంలోని మొత్తం 22 అండర్ పాస్ సబ్‌వేలలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం జీసీసీ 227 తాత్కాలిక పునరావాస కేంద్రాలను, ఆహార తయారీకి 112 కేంద్రీకృత వంటశాలలను సిద్ధంగా ఉంచింది.
ఆహార పంపిణి..
నీట మునిగిన ప్రాంతాల్లోని దాదాపు 13,500 మందికి ఆహార పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం కార్పొరేషన్ సొంత పంపులు, అద్దె పంపులు, ట్రాక్టర్ ఆధారిత పంపులతో సహా మొత్తం 1,189 వాహనాలు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జీసీసీ తరఫున 36 బోట్లు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 97 బోట్లను అప్రమత్తం చేశారు. రోడ్లపై పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు వందలాది పవర్ సా యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.