SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భర్త వివాహేతర సంబంధం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు..!!

Extramarital Affair: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంటే.. దాన్ని భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498ఏ కింద భార్య పట్ల చూపిన క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

Written By Bhoomi
Published: Oct 25, 2026, 11:02 AM IST | Updated: Oct 25, 2026, 11:03 AM IST
Image Credit: Extramarital Affair:
Join

Extramarital Affair: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంటే.. దాన్ని భారతీయ  శిక్షాస్మృతి సెక్షన్ 498ఏ కింద భార్య పట్ల చూపిన క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.   సెక్షన్ 498-ఏ కింద నేరాన్ని నిర్ధారించాలంటే వివాహేతర సంబంధానికి మించి.. తీవ్రమైన వేధింపులు లేదా క్రూరత్వానికి సంబంధించిన అదనపు ఆధారాలు తప్పనిసరి అని పేర్కొంది.

కేసు నేపథ్యం .. వివరాలు:
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2008లో వివాహం చేసుకున్న  దంపతులకు చిన్నారి సంతానం ఉంది. అయితే.. 2010లో సదరు మహిళ తన ఏడాదిన్నర వయసున్న బిడ్డతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అదనపు వరకట్నం కోసం వేధించడమే కాకుండా.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడని ఆమె గతంలో ఆరోపించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు భర్తపై ఐపీసీ సెక్షన్ 498-ఏ, సెక్షన్ 306 కింద కేసులు నమోదు చేశారు.

తిరుప్పూర్ ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు ఈ కేసులోని వరకట్న వేధింపుల ఆరోపణలను రుజువు చేసే సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ 2018లోనే భర్తను నిర్దోషిగా తీర్పు వెలువరించింది. అయితే.. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయకపోవడంతో.. మరణించిన మహిళ సోదరుడు టి. దైవకుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ సుందర్ మోహన్ ధర్మాసనం లోతుగా విచారణ జరిపింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని గుర్తించినప్పటికీ.. కేవలం ఆ ఒక్క కారణంతోనే భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించేంత క్రూరత్వం జరిగిందని చట్టపరంగా నిర్ధారించలేమని కోర్టు అభిప్రాయపడింది.

ఐపీసీ 498-ఏ కింద నేరం నిరూపితం కావాలంటే చట్టం నిర్వచించిన  క్రూరత్వానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉండాలని.. ఈ కేసులో అటువంటి అదనపు ఆధారాలు ఏవీ లభించలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన  పినాకిన్ మహిపత్రాయ్ రావల్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వం కేసులోని కీలక తీర్పును మద్రాస్ హైకోర్టు గుర్తుచేసింది. బాధితురాలు ప్రాథమికంగా ఇచ్చిన ఫిర్యాదులో వరకట్న వేధింపుల ప్రస్తావన లేకపోవడాన్ని... ఆరోపణలు అస్పష్టంగా ఉండడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ విశ్లేషణల అనంతరం.. పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ.. భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు ఖరారు చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES