SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పిల్లలకు చదువు చెప్పే గురువులకే అక్షరజ్ఞానం కరువు.. ప్రాథమిక ప్రశ్నలకు తడబడిన ప్రభుత్వ టీచర్లు.

Government Teachers: మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల దయనీయ స్థితిని కళ్లకు కట్టేలా.. దైనిక్ భాస్కర్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Written By Bhoomi
Published: Oct 26, 2026, 06:31 PM IST | Updated: Oct 26, 2026, 06:33 PM IST
Image Credit: Government Teachers
Join

Government Teachers: మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల దయనీయ స్థితిని కళ్లకు కట్టేలా.. దైనిక్ భాస్కర్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు 15 నుండి 20 ఏళ్ల సుదీర్ఘ బోధనా అనుభవం ఉండి.. నెలకు రూ. 50 వేలకు పైగా వేతనం అందుకుంటున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యంత ప్రాథమిక సమాధానాలు కూడా చెప్పలేక అపహాస్యం పాలయ్యారు.

మధ్యప్రదేశ్ లోని సర్కార్ బడుల్లో విద్యార్థులకు బోధిస్తున్న కొంత మంది ఉపాధ్యాయుల తీరు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. బోధనలో దాదాపు 15 నుంచి 20ఏళ్ల అనుభవం  ఉండి.. ప్రతి నెలా రూ. 50వేలకు పైగానే వేతనం అందుకుంటున్న టీచర్లు బేసిక్ క్వచ్చన్స్ కు కూడా సమాధానాలు చెప్పలేక తీవ్రంగా తడబడుతున్నారు.  'Nature'ను 'నేచూర్' (Nathoore) అని చదవడం.. 'Education' స్పెల్లింగ్ రాయమంటే 'AGUQUSAN' అని బోర్డుపై రాయడం.. భారత ఉపరాష్ట్రపతి ఎవరో కూడా తెలియదని చెప్పకోవడం వంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రభుత్వం టీచర్లకు నిర్వహించే టెట్..సామర్థ్య పరీక్షలను సర్వీసులో ఉన్న టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాము దశాబ్దాలుగా పిల్లలకు బోధిస్తున్నామని.. ఇఫ్పుడు తమ అర్హతలను ప్రశ్నించడం ఏంటంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిజమైన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు దైనిక్ భాస్కర్ బృందం ఛతర్ పూర్, రాజ్ గఢ్ జిల్లాల్లోని పలు సర్కారు బడుల్లో 20 రోజుల పాటు జరిగిన సమగ్ర పరిశోధనలో పలు దిగ్బ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి.

కేస్ స్టడీ 1: బార్‌ఖేడా పాఠశాల (ఛతర్‌పూర్)
సోషల్ టీచర్‌కు హరప్పా నాగరికత తెలియదు..

ఛతర్ పూర్ జిల్లా బార్ ఖేడా ప్రభుత్వ పాఠశాలలో ధన్ రాజ్ అహిర్ వార్ అనే టీచర్ గత 19 సంవత్సరాలుగా 9, 10వ తరగతుల విద్యార్థులకు సాంఘీక శాస్త్రం బోధిస్తున్నారు. ఈయన డీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగాన్ని సంపాదించారు. అయితే దైనిక్ భాస్కర్ బృందం ఆ ఉపాధ్యాయుడిని తన సబ్జెక్టుకు సంబంధించి హరప్పా నాగరికత కాలం ఏది అని ప్రశ్నించింది. ఆయన కొద్దిసేపు తరబడి.. నాకు తెలియదు అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లో  'Nature' అని రాయమని కోరగా బోర్డుపై 'Naicher' అని, 'Application' స్పెల్లింగ్‌ను 'APLICATION' అని రాశారు. సరే.. జనరల్ నాలెడ్జీ ఏమైనా ఉందా అని.. భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడిగారు. వారి పేర్లు కూడా తెలియకపోవడంతో ఆశ్చర్యపోయారు.

కేస్ స్టడీ 2: నదియా బిహార్ పాఠశాల (ఛతర్‌పూర్)
హెడ్‌మాస్టర్ 'Nature'ను 'నాథూర్' అని చదివారు..

ఛతర్‌పూర్ జిల్లాలోని  పీఎస్ నదియా బిహార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బరేలాల్ ఆదివాసిని 'Tiger' ను ఇంగ్లీషులో ఏమంటారని అడగ్గా "టైగర్" అని చెప్పారు. కానీ బోర్డుపై రాయమంటే 'Tigar' అని రాశారు.  ఆ తర్వాత బోర్డుపై ఉన్న 'NATURE' అనే పదాన్ని చదవమంటే ఆయన దానిని "నాథూర్" (Nathoore) అని ఉచ్చరించారు. ఒక దరఖాస్తు (Application) రాయమని అడగ్గా..  నాకు కంగారుగా ఉంది, ఇంగ్లీషులో కాస్త బలహీనంగా ఉన్నాను.. హిందీలో రాయమనండి  అని కోరారు. సరేనని హిందీ పదం  వరిష్ఠ (Senior) ఇంగ్లీష్ పదం 'Student'ను హిందీ లిపిలో రాయమని కోరగా.. ఆయన వాటిని 'బరిష్ఠ' (Barishth)   'స్టూటెండ్' అని తప్పులుగా రాశారు.

కేస్ స్టడీ 3: చాతుఖేడా, ఉదయ్‌పురియా పాఠశాలలు (రాజ్‌గఢ్)
'Future' అంటే 'ఫీచర్'.. 'Education' అంటే 'AGUQUSAN

రాజ్‌గఢ్ జిల్లా చాతుఖేడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1998 నుండి పనిచేస్తున్న రమేష్ వర్మ అనే ఉపాధ్యాయుడు బోర్డుపై ఉన్న 'Nature'ను 'Neture' అని చదివారు. 'Education' స్పెల్లింగ్‌ను తప్పుగా రాశారు. గోవింద్ సింగ్ రాజ్‌పుత్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అని ఆయన సమాధానమిచ్చారు.  అలాగే, ఉదయ్‌పురియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అన్ని సబ్జెక్టులు బోధించే హుకుమ్ సింగ్ కార్పెంటర్ అనే టీచర్ 'Future' పదాన్ని 'Feature' అని చదివారు. ఇక 'Education' స్పెల్లింగ్ రాయమంటే బోర్డుపై 'AGUQUSAN' అని, 'Tuition'ను 'TUESN' అని, హిందీ పదం 'నిష్కళంక్'ను 'నిసంకలంక్' అని రాశారు. అంతేకాకుండా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి "అభిషేక్ సింగ్" అని చెప్పారు. ఇదే పాఠశాలలో అమృత్‌లాల్ అనే మరో ఉపాధ్యాయుడు అక్టోబర్ 1 నుండి ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు తేలింది.

విద్యా హక్కు చట్టం (RTE) 2009 ప్రకారం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్ష (Competency test) తప్పనిసరి. తాజా గణాంకాల (UDISE 2024-25) ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 76,000 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల 90 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

గ్రేడ్ 1 ఉపాధ్యాయుడి వేతనం: నెలకు సుమారు రూ. 1 లక్ష

గ్రేడ్ 2 ఉపాధ్యాయుడి వేతనం: నెలకు సుమారు రూ. 90,000

గ్రేడ్ 3 ఉపాధ్యాయుడి వేతనం: నెలకు సుమారు రూ. 65,000

సగటు వేతనం: నెలకు రూ. 85,000

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయుల జీతాల కోసమే ప్రతి ఏటా దాదాపు రూ. 3,978 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది కాకుండా ఏటా 3శాతం వేతన పెంపు కూడా ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో ప్రజాధనాన్ని జీతాలుగా చెల్లిస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయులు ఇలా  చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడం కలవరపెడుతోంది. 
 

 Also Read: 

డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ పై నిరుద్యోగుల అసంతృప్తి...పోస్టులు పెంచాలని డిమాండ్..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES