SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ప్రపంచ బ్యాంక్ నివేదికలో కీలక విషయాలు..!

World Bank Poverty Report 2026: భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. రోజుకు 4.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందని పేర్కొంది. వరల్డ్ బ్యాంక్‌ నివేదికలోని వివరాలు..

Written By Ashok Krindinti
Published: Nov 04, 2026, 02:19 PM IST | Updated: Nov 04, 2026, 02:21 PM IST
Image Credit: India Poverty Rate (Source: AI Generated)
Join

World Bank Poverty Report 2026: భారత్‌లో పేదరికంపై ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడినట్లు తన నివేదికలో పేర్కొంది. పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్-అక్టోబర్ 2026 పేరుతో నివేదిక వెల్లడించిన వరల్డ్ బ్యాంక్.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనదేశంలో పేదరికం వేగంగా తగ్గిందని తెలిపింది. 2011 నాటికి దేశంలో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం.. 2023 నాటికి ఏకంగా 2.6 శాతానికి దిగివచ్చినట్లు వెల్లడించింది. భారత్‌లో పేదరికం తగ్గడానికి ప్రధాన కారణాలేంటి..? ఉపాధి కల్పన, మహిళల ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఎంత..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. రోజుకు 3 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారి సంఖ్యను తీవ్ర పేదరికంగా పరిగణిస్తారు. ఈ ప్రమాణం ప్రకారం 2011లో దేశ జనాభాలో 27.1 శాతం మంది తీవ్ర పేదరికంలో ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 2.6 శాతానికి పడిపోయింది. అదేవిధంగా రోజుకు 4.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారి శాతం కూడా భారీగా తగ్గింది. 2011లో ఈ సంఖ్య 57.7 శాతంగా ఉండగా.. 2023 నాటికి 16.1 శాతానికి చేరింది. ఈ మార్పుతో సుమారు 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

దేశంలో పేదరికం తగ్గడానికి ప్రజల వినియోగ సామర్థ్యం పెరగడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందడం ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో విశ్లేషించింది. ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం ఈ మార్పులో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. 2017 నుంచి 2023 మధ్య దేశంలో ఉద్యోగాల సంఖ్య సుమారు 13.4 కోట్ల మేర పెరిగింది. పని చేసే వయసులో ఉన్న జనాభా పెరుగుదలతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి దాదాపు రెండింతలుగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వేతనంతో కూడిన పనుల్లోకి రావడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదరికం తగ్గడానికి దోహదపడినట్లు నివేదికలో వరల్డ్ బ్యాంక్ ప్రస్తావించింది. ప్ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) ద్వారా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) ద్వారా ఇళ్ల నిర్మాణం, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని తెలిపింది. అయితే ఆహార ధాన్యాల పంపిణీ ఒక్కటే పేదరికం తగ్గడానికి కారణం కాదని.. ఉపాధి, వినియోగ వ్యయం పెరుగుదల, ఇతర సంక్షేమ పథకాలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యాయని నివేదికలో వెల్లడించింది.

భారత్‌లో పేదరికం తగ్గడం ఇటీవలి కాలంలోనే ప్రారంభం కాలేదు. 2004-05 నుంచి 2011-12 మధ్య కూడా జాతీయ స్థాయి టెండూల్కర్ కమిటీ పేదరిక అంచనా ప్రకారం.. పేదరికం 37.2 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ ఆహార భద్రత చట్టం వంటి కార్యక్రమాలు కూడా గతంలో పేదలకు అండగా నిలిచాయి. అయితే ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 2011-12 నుంచి 2022-23, 2023-24 సర్వేల మధ్య పేదరికం గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 2022-23లో రోజుకు 4.20 డాలర్ల ప్రమాణం ప్రకారం పేదరికం 23.9 శాతానికి చేరగా.. 2023 నాటికి మరింత తగ్గి 16.1 శాతంగా నమోదైంది.

పేదరికం తగ్గినా.. దేశంలో కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ముఖ్యంగా నాణ్యమైన ఉపాధి కల్పన, యువతలో నిరుద్యోగ సమస్య, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. మొత్తంగా చూస్తే.. గత 12 ఏళ్లలో భారత్‌లో పేదరికం తగ్గిన తీరు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పును ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES