IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?
IRCTC Current Booking Option: సాధారణంగా మొదటి రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన వెంటనే రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియ ముగిసిపోయిందని ప్రయాణికులు భావిస్తుంటారు. అయితే ఖాళీగా ఉన్న బెర్తులు లేదా రద్దయిన సీట్ల కోసం రైల్వే శాఖ 'కరెంట్ బుకింగ్' సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ప్రయాణికులు చివరి నిమిషంలో కూడా కన్ఫర్మ్ టికెట్లను పొందే వెసులుబాటు కలదు. ఇటీవల మొదటి, తుది రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో కూడా రైల్వే శాఖ పలు కీలక మార్పులు చేపట్టింది.
IRCTC Current Booking Option: రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి మొదటి రిజర్వేషన్ చార్ట్ విడుదలైన తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే వెసులుబాటు అందుబాటులో ఉంది. రైలులో సీట్లు లేదా బెర్తులు ఖాళీగా ఉంటే 'కరెంట్ బుకింగ్' విధానం ద్వారా వాటిని బుక్ చేసుకోవచ్చు. మొదటి చార్ట్ తయారైన వెంటనే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోదని సీనియర్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకోవడం వల్ల లేదా ఇతర సర్దుబాట్ల కారణంగా మిగిలిన బెర్తులను రైల్వే శాఖ కరెంట్ బుకింగ్ కింద వర్గీకరించి కేటాయిస్తుంది.
ఐఆర్‌సీటీసీ నిబంధనలు, వెసులుబాట్లు..
ఈ కరెంట్ బుకింగ్ సదుపాయం కింద ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ (Confirm) టికెట్లు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఆర్ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ (Waiting List) టికెట్లు అందుబాటులో ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) మార్గదర్శకాల ప్రకారం.. ఈ సదుపాయం సాధారణ ప్రయాణికులతో పాటు ఏజెంట్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో కేవలం ఈ-టికెట్లను (E-Tickets) మాత్రమే అనుమతిస్తారు. వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు), దివ్యాంగులకు వర్తించే రాయితీలు ఈ కరెంట్ బుకింగ్ టికెట్లపై కూడా లభిస్తాయి.
ప్రయాణికుల వివరాలు మార్చేందుకు నో..
కరెంట్ బుకింగ్ ద్వారా పొందిన టికెట్లపై ప్రయాణికుడి పేరు, వయస్సు, జెండర్ లేదా ప్రయాణం ప్రారంభించే బోర్డింగ్ పాయింట్ వంటి వివరాల మార్పులకు అవకాశం ఉండదు. అలాగే ప్రీమియం, సువిధ రైళ్ల విషయానికి వస్తే, చివరిగా బుక్ అయిన టికెట్ ధరల ఆధారంగానే ఈ టికెట్ల ధరలు వర్తిస్తాయి.
రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో మార్పులు..
ఇటీవల రైల్వే శాఖ చార్ట్ తయారీ సమయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఉదయం 05:01 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించి, ముందు రోజు రాత్రి 08:00 గంటలకే మొదటి చార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. మిగిలిన రైళ్లకు కనీసం 10 గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది. అలాగే, రైలు బయలుదేరడానికి సుమారు 30 నిమిషాల ముందు తుది చార్ట్‌ను సిద్ధం చేస్తారు. కాబట్టి, మొదటి చార్ట్ తయారీతో బుకింగ్ ముగిసిందని భావించకుండా, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను నేరుగా తనిఖీ చేసుకుని టికెట్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు.