Rajasthan Viral News: దొంగతనం చేసిన తరువాత ఏం చేస్తారు..? చోరీ చేసిన సొమ్మును ఎక్కడో ఒక చోట ఆమ్మేసుకుని.. డబ్బులు తీసుకుని పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతారు. కానీ రాజస్థాన్‌లో ఓ మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. నగల దుకాణంలో వెండి గాజులు దొంగిలించిన ఆమె.. మళ్లీ వెనక్కి తిరిగి ఆ షాపు ఓనర్‌కు ఇచ్చేసింది. అంతేకాదు అందరి ముందు గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళ ఎందుకు దొంగతనం చేసిన గాజులను తిరిగి వెనక్కి ఇచ్చింది..? తన సొత్తును తన వద్దకు తెప్పించుకునేందుకు ఆ షాప్ ఓనర్ ఏం చేశాడు..? వివరాలు ఇలా..
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా రేన్వాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నగల దుకాణానికి ఓ మహిళ కస్టమర్‌లా వెళ్లింది. నగలు చూస్తున్నట్లు నటిస్తూ.. అదును కోసం ఎదురుచూసింది. ఈ క్రమంలో దుకాణంలో ఉన్న వెండి గాజులను ఎవరికీ అనుమానం రాకుండా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఆమె చేసిన పని మొత్తం రికార్డయింది. ఫుటేజీని పరిశీలించిన దుకాణ యజమాని.. మహిళే గాజులను తీసుకెళ్లినట్లు గుర్తించారు.
గాజులు కనిపించకపోవడంతో దుకాణదారుడు పోలీసులను ఆశ్రయించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని మహిళకు విజ్ఞప్తి చేశాడు. దొంగిలించిన వెండి గాజులను తన తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం 24 గంటల గడువు కూడా విధించాడు. దుకాణదారుడు చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఆ మహిళ కూడా ఈ వీడియోను చూసి స్పందించింది. దొంగిలించిన గాజులను తీసుకుని తిరిగి అదే ఆ షాపు ఓనర్‌కు ఇచ్చేసింది. అంతేకాదు.. తన తప్పును అంగీకరిస్తూ ఆయన ఎదుట గుంజీలు తీసింది. మరోసారి ఇలాంటి పని చేయనంటూ క్షమాపణలు చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. దొంగతనం చేసిన మహిళే తిరిగి వచ్చి నగలను అప్పగించడం.. అందరి ముందు క్షమాపణలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.