Tanishq Jewellery Theft: కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వేసిన తాళాలు పగలగొట్టడమే కాకుండా గోడకు కన్నం వేసి లోపలకు చొచ్చుకెళ్లి బంగారు దుకాణంలో కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు, దుకాణ యజమానుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఆభరణాల షోరూమ్ ప్రారంభమై రెండు వారాలు కూడా కాలేదు. ఆర్భాటంగా ప్రారంభించిన ఆ షోరూమ్ తాళాలు పగలగొట్టి.. గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. షోరూమ్‌లో లోపల మాత్రం కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. షోరూమ్‌లోకి చొరబడిన దొంగలు అందినకాడికి దోచుకుని వెళ్లిపోయారు. దోచుకెళ్లిన బంగారు ఆభరణాలు దాదాపు 16 నుంచి 20 కిలోలు ఉంటాయని.. వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ దొంగతనం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని మధురైలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. మదురైలోని పలంగనాథమ్ ప్రాంతంలో పది రోజుల కిందట తనిష్క్ షోరూమ్ ప్రారంభమైంది. బుధవారం రాత్రి షట్టర్ తాళాలను పగలగొట్టిన దుండగులు.. ఆ వెంటనే దుకాణం గోడకు కూడా కన్నం వేశారు. అనంతరం షోరూమ్ లోపలికి వెళ్లి దుండగులు సొత్తును చోరీ చేశారు. గురువారం ఉదయం యథావిధిగా షోరూమ్ తెరవడానికి వచ్చి చూసిన సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. తాళాలు పగులగొట్టి ఉండడమే కాకుండా లోపల బంగారు ఆభరణాలు మాయమవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెనుక వైపు తలుపులు పగలగొట్టి ఉన్నాయని స్టోర్ ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం సీసీ ఫుటేజీను పరిశీలించి నిందితులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక తమ షోరూమ్‌లో దొంగతనంపై తనిష్క్ జ్యువెలరీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 16 కిలోల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు దుకాణ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది.
అసంపూర్తి నిర్మాణమే కారణం
ప్రముఖ జ్యువెలరీలో ఈ స్థాయిలో భారీ చోరీ జరగడం తమిళనాడులో తీవ్ర సంచలనం రేపుతోంది. దొంగతనానికి కారణం ఈ స్టోర్ ఉన్న భవనం ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణ పనులు సుమారు 70 శాతం పూర్తవగా.. 10 రోజుల కిందట షోరూమ్‌ను ప్రారంభించారు. అయితే భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇది భవనంపై పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన మధురై పోలీసులు ఈ దొంగతనంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. ఇక దొంగల కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు.