Madhya Pradesh Hooch Liquor Deaths: మధ్యప్రదేశ్ పోలీసుల ప్రకటన వివరాల ఆధారంగా.. ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల అజయ్ రాథోర్ సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 మధ్య కాలంలో ఇంట్లోనే మద్యం ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి ఏఐ (AI) సాధనాలను పదేపదే ఉపయోగించాడు. ఏఐ ద్వారా పొందిన పాక్షిక పరిజ్ఞానంతో, ఇంటర్నెట్‌లో వెతికి ఇండోర్‌లోని 'రైజింగ్ బ్రదర్స్' అనే ప్రైవేట్ సాల్వెంట్ టోకు వ్యాపారిని సంప్రదించాడు. అక్కడి నుంచి అమన్ కస్లివాల్ అనే వ్యక్తి ద్వారా కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే పారిశ్రామిక రసాయనాలను సేకరించాడు.
తయారీ విధానం, గ్రామాల్లో విక్రయాలు..
అక్టోబర్ 1న రసాయనాలు అందుకున్న తర్వాత, అజయ్ రాథోర్, అతని సహచరులు రసాయనాలు, నీటిని ఉపయోగించి కల్తీ మద్యాన్ని తయారు చేశారు. అక్టోబర్ 2 నుంచి 7 మధ్య స్క్రాప్ వ్యాపారుల నుంచి లైసెన్స్ కలిగిన మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలను, సత్యేంద్ర ఓఝా అనే వ్యక్తి నుంచి మూతలను సేకరించారు. ఆ పాత సీసాలలో కల్తీ మద్యాన్ని నింపి, అసలైన మద్యంతో కలిపి అక్టోబర్ 6 నుంచి 12 మధ్య దేవాస్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించారు. దీనివల్ల వినియోగదారులు అసలు, నకిలీల మధ్య తేడాను గుర్తించడం కష్టమైంది.
ఆ కల్తీ మద్యం సేవించిన తర్వాత సెప్టెంబర్ 27 నుంచి చందనా, బింజనా గ్రామాలలో 13 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. కల్తీ మద్యం తాగి కనీసం 10 మంది చనిపోయారని స్థానికులు ఆరోపించగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ 22 మంది మరణించారని, 40 మందికి చూపు దెబ్బతిన్నదని ఆరోపించారు.
తొలుత దేవాస్ జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, పోలీసుల విచారణలో అక్రమ మద్యం స్మగ్లర్ల నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. స్వాధీనం చేసుకున్న మద్యం, రసాయనాల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) పరీక్షలకు పంపారు.
కేసు నమోదు, పోలీసుల విచారణ వేగవంతం..
అక్టోబర్ 26న ప్రధాన నిందితుడు అజయ్ రాథోర్‌ను అరెస్టు చేశారు. ఇప్పటివరకు అమన్ కస్లివాల్, విశాల్ చౌహాన్, రామేశ్వర్ సింగ్ సోంగారాతో పాటు మూడు లైసెన్స్డ్ మద్యం దుకాణాల మేనేజర్లు, సేల్స్‌మెన్లతో కలిపి 10 నుంచి 11 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు గోవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రసాయనాలు సరఫరా చేసిన గోదామును సీజ్ చేసి, మధ్యప్రదేశ్ ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.