PG Medical Counseling 2026: నీట్-పీజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ 10,000కు పైగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య సీట్లు బ్లాక్ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులు ఆల్ ఇండియా కోటాతో పాటు ఆయా రాష్ట్రాల కోటాలోనూ ఒకేసారి సీట్లు దక్కించుకుని వాటిని అలాగే నిలుపుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. కొత్తగా తీసుకొచ్చిన ఫ్లోట్ విధానంలో మార్పులు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నీట్ పీజీ అభ్యర్థుల కోసం పనిచేసే సార్థ యాప్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రెండో రౌండ్ అనంతరం దేశవ్యాప్తంగా 10,105 పీజీ మెడికల్ సీట్లు బ్లాకింగ్ కేటగిరీలోనే ఉన్నాయి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తోపాటు వేరే కౌన్సెలింగ్ లోనూ సీటు పొందిన అభ్యర్థుల వద్ద ఉన్న సీట్లను ఈవిధంగా గుర్తించారు. ఈ వివరాలను డాక్టర్ కపిల్ దేవ్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. వైద్య సామాజిక కార్యకర్త డాక్టర్ నచికేత్ భాటియా కూడా ఈ సమస్య తీవ్రతను ప్రస్తావించారు. అత్యధికంగా ఎండీ జనరల్ మెడిసిన్ లో 1,026, ఎంఎస్ ఆబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాజీలో 861, ఎంస్ జనరల్ సర్జరీలో 786 సీట్లు బ్లాక్ అయినట్లు డేటా కూడా స్పష్టం చేస్తోంది.
ఈ ఏడాది నూతనంగా తీసుకొచ్చిన ఫ్లోట్ విధానం వల్ల అభ్యర్థులకు ఒకే సమయంలో రెండు సీట్లను తమ వద్దే ఉంచుకునే వెసులుబాటు కలుగుతోందని కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగమైన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. తమకు కేటాయించిన సీటును నిలుపుకుంటూనే.. అంతకంటే మెరుగైన సీటు కోసం పోటీపడే అవకాశాన్ని ఈ విధానం ఇస్తుంది. అయితే ఆల్ ఇండియా కోటా, రాష్ట్రాల కోటా కౌన్సెలింగ్‌లు విడివిడిగా జరుగుతుండటంతో, విద్యార్థులు ఈ రెండింటిలోనూ ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా రెండు సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ఫ్లోట్ ఆప్షన్‌ను కేవలం మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు మాత్రమే పరిమితం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ అధికారి వెల్లడించారు. రెండో రౌండ్ నుంచే కేటాయించిన కళాశాలలో అభ్యర్థులు నేరుగా చేరడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత మొత్తం పరిస్థితిని సమీక్షించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రెండో రౌండ్ ఫలితాలను 24 గంటల పాటు నిలిపివేసి, అభ్యర్థులు తమ వద్ద ఉన్న రెండు సీట్లలో ఒకదానిని వదులుకునేందుకు సమయం ఇవ్వాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) డిమాండ్ చేసింది.
Also Read: