Delhi Protest: వెనక్కి తగ్గిదే లేదు.. ఎలాగైనా 1వ తేదీన ఇండియా ర్యాలీ చేస్తాం: రాహుల్ గాంధీ
Rahul Gandhi Announces No More Postpone INDIA Block Rally: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. వాయిదా వేయాలని వ్యాపారులు చేసిన విజ్ఞప్తిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
INDIA Block Rally: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం తాము పోరాటం చేస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1వ తేదీన చేపట్టాల్సిన భారీ ర్యాలీని నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీలోని వ్యాపారులు చేసిన వాయిదా విజ్ఞప్తిని పట్టించుకోకుండా భారీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఇది వేర్వేరు నిరసన కార్యక్రమం కాదని.. ఒకే ఉద్యమమని అని రాహుల్ గాంధీ తెలిపారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఈ పోరాటంలో పాల్గొంటాయని చెప్పారు. సర్ ప్రక్రియపై నిరసన తెలపాలనుకునే ప్రతీ ఒక్కరూ రామ్‌లీలా మైదాన్‌కు రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
దీపావళి నేపథ్యంలో తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగాల్సిన భారీ నిరసన ర్యాలీ వాయిదా పడుతుందని అందరూ భావించారు. అయితే ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఒక స్పష్టత ఇచ్చారు. ఏది ఏమీ జరిగినా అక్కడ నిరసన ర్యాలీ ఉంటుందని స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నవంబర్ 1వ తేదీన చేపట్టిన భారీ ర్యాలీకి దాదాపుగా 10 లక్షల మంది హాజరవుతారని ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. నిరసన కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. 'సర్ ప్రక్రియతో కోట్లాది మంది ఓటు హక్కును కోల్పుతున్నారనే ఆవేదన ప్రజల్లో ఉంది. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది' అని రాహుల్ గాంధీ తెలిపారు. గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ, నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ర్యాలీ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దేశ రాజధాని న్యూఢిల్లీకి పయనమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ బాట పట్టారు. రామ్‌లీలా మైదానంలో సీఈసీగా జ్ఞానేష్ కుమార్‌ను తప్పించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలివెళ్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఇచ్చేందుకు రైల్వేశాఖ నిరాకరించడంతో బస్సులు, విమానాల్లో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు.
వ్యాపారుల లేఖ ఇదే..
కాంగ్రెస్ కూటమి చేపట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఢిల్లీ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. గతంలో ప్రెస్‌మీట్లు పెట్టి విజ్ఞప్తి చేయగా.. ఇప్పుడు రాహుల్ గాంధీతోపాటు సోనియా గాంధీకి లేఖ రాశారు. నవంబర్ 1న తలపెట్టిన ర్యాలీ వాయిదా వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మాక్ పార్లమెంట్ కార్యక్రమం వాయిదా వేసిన తరహాలోనే ర్యాలీని కూడా వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు కోరారు. అక్టోబర్ 30న ఢిల్లీ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆశిష్ గ్రోవర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న అంశాలపై రాజకీయ ఘర్షణలు, బహిరంగ ప్రదర్శనలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంబంధిత పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ వాదనలు, అఫిడవిట్లు సమర్పించాయని లేఖలో ప్రస్తావించారు. న్యాయ ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని.. రాజకీయ బలప్రదర్శనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఢిల్లీలో వరుస నిరసనలు, ర్యాలీలతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దీపావళి పండుగకు ముందు చేపట్టే భారీ ర్యాలీతో ట్రాఫిక్ సమస్యలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు, వాణిజ్య కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడతాయని వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఢిలలీ ప్రజలు వాపోతున్నారు. వ్యాపారులు, దుకాణదారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలు, రోజువారీ కూలీలు ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో మరోసారి వ్యాపారాలకు అంతరాయం కలగడం మంచిది కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు, భావప్రకటనా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే రాజకీయ కార్యక్రమాలతో సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాలు ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు.