బ్యాంకింగ్ రంగానికి సైబర్ ముప్పు.. మోడీ..!! భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ఏర్పాటు..
RBI data centre: ఆధునిక కాలంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా జరుగుతున్నాయన్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే దేశ బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన డేటా సెంటర్, సైబర్ భద్రత శిక్షణ సంస్థను ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
New Data Centre Located At Bhuvaneshwar: రూ. 169 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తుందన్నారు. భువనేశ్వర్‌లో డిజిటల్ బ్యాంకింగ్ సేవల భద్రతను బలోపేతం చేయడం, సైబర్ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో దీనిని ఏర్పాటు చేశారు.
169 కోట్ల ఖర్చుతో RBI డేటా సెంటర్ ఏర్పాటు..
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భారత్ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో, మన బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ నేరస్థులు, సైబర్ ఉగ్రవాదుల నుంచి రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. నేడు, సైబర్ ముప్పుల రూపురేఖలు నిరంతరం మారుతున్నాయి. పాతబడిన వ్యవస్థలు, పాత శిక్షణా పద్ధతులు లేదా కాలం చెల్లిన సాధనాలతో ఈ కొత్త సవాళ్లను మనం ఎదుర్కోలేమన్నారు. మనకు ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. ఇక్కడే ఈ కొత్త సైబర్ సెక్యూరిటీ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
బ్యాంకింగ్ రంగానికి సైబర్ ముప్పు: మోడీ..
గత పదేళ్లలో బ్యాంకింగ్ సేవలు అందని వర్గాలకు వాటిని చేరువ చేయడంపై దృష్టి సారించామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక రానున్న దశాబ్దంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్థంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండటమే కాకుండా, వాటిని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకునేలా చూడాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్ లావాదేవీల భద్రత, వేగవంతమైన సేవలు, ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం భవిష్యత్తులో కీలకమన్నారు ప్రధాని మోడీ.