Shigella Outbreak In Kerala: కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న భక్తులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏర్పడింది. మలప్పురం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 75 షిగెల్లా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ నిర్ధారణ కావడంతో జిల్లా ఆరోగ్యశాఖ నిఘాను పెంచింది.
ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, స్థానిక పరిపాలన, ఆహార భద్రత విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విందులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.
అసలు షిగెల్లా అంటే ఏమిటి?
షిగెల్లా అనేది పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా. కలుషితమైన తాగునీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఏర్పడినా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపించవచ్చు.
లక్షణాలు ఇవే!
షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినవారిలో విరేచనాలు, మలంలో రక్తం లేదా చీము, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. తరచూ విరేచనాలు కావడంతో శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.
అయ్యప్ప భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు
శబరిమల యాత్రలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన లేదా సురక్షితంగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి. తాజాగా తయారైన, పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. బయట బహిరంగంగా ఉంచిన పదార్థాలు, ఎక్కువసేపు నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
విరేచనాలు మొదలైతే శరీరంలో నీరు తగ్గకుండా ORS ఉపయోగించాలి. అయితే రక్తంతో కూడిన విరేచనాలు, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. స్వయంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు.