Super El Nino Deaths 2026: క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ విడుదల చేసిన '451,000 at Risk' నివేదిక ప్రకారం.. జూన్ 2026లో ప్రారంభమయ్యే ఎల్‌నినో ప్రభావం ఉత్తరార్థగోళ వసంతకాలం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ కాలంలో ప్రపంచ భూభాగ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2°C అధికంగా ఉండటంతో పాటు, అత్యంత వేడి రోజులు 44 శాతం పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దీని ఫలితంగా జూన్ 2026 నుండి ఫిబ్రవరి 2027 వరకు తొమ్మిది నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,51,000 అదనపు మరణాలు సంభవించవచ్చని, ఆరు నెలల కాలంలోనే 2,39,000 మరణాలు జరగవచ్చని నివేదిక అంచనా వేసింది.
భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాల్లో స్థితిగతులు..
భారత్‌లో నమోదయ్యే 15,800 అదనపు మరణాల్లో అత్యధిక భాగం దక్షిణాది రాష్ట్రాలపైనే పడనుంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధికంగా 2,640 మరణాలు అంచనా వేయగా, కర్ణాటక 1,870 మరణాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో చెరో 1,680 మరణాలు, తమిళనాడులో 1,640 మరణాలు, అలాగే తెలంగాణలో 1,122 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ఐదు దక్షిణ రాష్ట్రాల్లోనే మొత్తం 7,992 మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ప్రమాదంలో ఉన్న వర్గాలు..
దక్షిణాదిలో ఉష్ణ తీవ్రత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా ఉండి, నవంబర్-డిసెంబర్‌లలో కొంత తగ్గినప్పటికీ, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు, శీతలీకరణ వసతులు లేనివారు, ఎండలో పనిచేసే బహిరంగ రంగ కార్మికులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు
చేపట్టాల్సిన నివారణ చర్యలు..
ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఉచిత తాగునీటి కేంద్రాలు, కూలింగ్ సెంటర్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం. ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాలను పెంచడంతో పాటు భవిష్యత్తులో తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధ్యయనం ముగించింది.