తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!
Tamil Nadu Jailbreak: ఒక్కోసారి సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా తరహాలో కనిపిస్తాయి. సినిమాల్లో జరినట్టు నిజ జీవితంలో జరుగుతుందా.. లేకపోతే నిజ జీవితంలో జరిగిందే సినిమాల్లో చూపిస్తారా అనేది పక్కన పెడితే.. అచ్చు సినిమాల్లో చూపించినట్టుగానే తమిళనాడులో కొంద మంది ఖైదీలు సినీ ఫక్కీలో పరారైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
17 Prisoners Escape from Theni Sub-Jail: తమిళనాడు రాష్ట్రం తేని ఓ చెరసాల నుంచి ఖైదీలు పరారు అవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తేని జిల్లాలోని సబ్ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు ముందుస్తుగా సిద్ధం చేసుకున్న పక్కా ప్లాన్‌తో తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. తేని నుంచి దిండిగల్ వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. పరారైన ఖైదీల్లో ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇక మిగిలిన 13 మంది ఖైదీలు జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపి అడివిలో అణువణున గాలిస్తున్నారు. అయితే గతంలో 1995లో ఇలాంటి తరహా ఘటన జరిగింది.అప్పట్లో కేవలం ఐదారుగురు మాత్రమే తప్పించుకున్నారు. ఈ సారి మాత్రం ఏకంగా 17 మంది ఖైదీలు తప్పించుకోవడం ఇదే తొలిసారిగా పోలీసులు తెలిపారు.అందులో 4 గురు పోలీసులకు చిక్కారు.
సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలు పక్కా ప్లాన్‌తోనే ఎస్కేప్ అయినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి పరారయ్యేందుకు ఒక ఖైదీ మూర్చ వచ్చినట్లు నాటకం ఆడినట్లు సమాచారం. జైలు సిబ్బంది గదిలోకి ప్రవేశించడంతో దాడి చేసి పరారు అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గాయపడిని సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు.