TATA Group New Turn: టాటా గ్రూపులో వివాదాలు సంచలనాలకు దారితీశాయి. టాటా సంస్థకు సారథ్యంపై బోర్డు సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి నెలకొంది. టాటా గ్రూపులో టాటా సన్స్, టాటా గ్రూపులో మెజారిటా వాటా ఉన్న ట్రస్టు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఉన్న నోయెల్ టాటా ఒకవైపు, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మరోవైపు ఈ వివాదంలో ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. ఈ వివాదం ఇప్పుడు బోర్డ్ రూమ్ నుండి తాజాగా కోర్టు మెట్లు ఎక్కింది.
టాటా గ్రూపునకు సంబంధించి స్టాక్ మార్కెట్ లిస్టింగ్ విషయంలో టాటా సన్స్ గ్రూపు ఛైర్మన్ చంద్ర శేఖరన్ రిజర్వు బ్యాంకు నిబంధనలు పాటిస్తూ పబ్లిక్ లిస్టింగ్ తప్పని సరిగా పాటించాలన్న వాదనను టాటా ట్రస్టు ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ వల్ల టాటా గ్రూపు సేవా దృక్పథం, ప్రత్యేకత దెబ్బతింటుందని టాటా ట్రస్టు ప్రతినిధి నోయల్ టాటా వాదిస్తున్నారు.
చంద్ర శేఖరన్ పునర్నియామకంపై కుదరని ఏకాభిప్రాయం..
టాటా సంస్థకు ఛైర్మన్ పునర్నియామకంపై వివాదం నెలకొంది. టాటా బోర్డులో ఉన్న ఐదుగురి సభ్యుల్లో నలుగురి ఆమోదంతో చంద్రశేఖరన్ ఛైర్మన్ గా నియామకం జరిగింది. చంద్రశేఖరన్ నియామకాన్ని టాటా ట్రస్టు ప్రతినిధి నోయల్ టాటా వ్యతిరేకిస్తున్నారు. ట్రస్ట్ నామినీ డైరెక్టర్ల పూర్తి ఆమోదం లేకపోవడంతో ఆ నియామకం చెల్లదని వాదిస్తున్నారు.
టాటా సంస్థ నిర్వహణ చట్టప్రకారం నియంత్రణ అధికారం కంపెనీ నిర్వహణ బోర్డు పరిధిలో ఉంటుందని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ అంటున్నారు. కంపెనీలో మెజారిటీ వాటాదారుగా ఉన్న టాటా ట్రస్టుదే పైచేయి కావాలని ట్రస్టు ప్రతినిధి నోయల్ టాటా పట్టుబడుతున్నారు. ప్రతి అంశంలోనూ ఆదిపత్యపోరాటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల జాబితాలో ఉన్న టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం తప్పనిసరి. టాటా సన్స్ బోర్డు, స్వతంత్ర డైరెక్టర్లు ఈ లిస్టింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. అయితే, నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కంపెనీ పబ్లిక్ లిస్టింగ్ అయితే, టాటా సంస్థలకున్న దాతృత్వ స్వభావం దెబ్బతింటుందని, అలాగే బయటి వ్యక్తుల జోక్యం పెరుగుతుందని నోయల్ టాటా భావిస్తున్నారు.
పూర్వం 2016లో సైరస్ మిస్త్రీ - రతన్ టాటా మధ్య జరిగిన బోర్డ్‌రూమ్ వివాదాన్ని ఈ తాజా పరిణామాలు తలపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత వివాదం వ్యక్తుల మధ్య కాకుండా టాటా సన్స్ గవర్నెన్స్ నిర్మాణం మరియు చట్టపరమైన నిబంధనల చుట్టూ తిరుగుతోంది.
ఆధిపత్యం కోసం కోర్టు మెట్లు ఎక్కిన టాటా సంస్థ ప్రతినిధులు..
సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి టాటా సన్స్ చైర్మన్‌గా నియమిస్తూ 4:1 మెజారిటీతో బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, నోయెల్ టాటా ఈ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్ల పూర్తి మద్దతు లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చెల్లదన్నారు. ఇది అంతర్గత నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని పొడిగించే అంశంలో టాటా సంస్థలో బోర్డ్ రూమ్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి సమయంలో తమ వాదనను వినకుండా తమకు వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండేందుకే నోయెల్ ఈ కేవియట్ పిటిషన్ వేశారని స్పష్టంగా తెలుస్తోంది.
టాటా సన్స్ వర్సెస్ టాటా ట్రస్టు బోర్డు..
టాటా ట్రస్ట్స్ , టాటా సన్స్ మధ్య నాయకత్వం, పాలనాపరమైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా బోర్డు నిర్ణయాలు కోర్టు మెట్లెక్కాయి. టాటా సంస్థలో న్యాయపోరాటం ముదురుతున్న నేపథ్యంలో నోయెల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్ టాటా మహారాష్ట్ర చారిటీ కమిషనర్ , ముంబయి సిటీ సివిల్ కోర్టులలో కేవియట్ పిటిషన్లను దాఖలు చేశారు. తమ వాదన వినకుండా ఎలాంటి ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వకూడదని వారు కోరారు.
టాటా నోయల్ జోక్యంపై పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్ ఫిర్యాదు..
టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ నియామకం, ఆయన శాశ్వత ట్రస్టీగా కొనసాగుతోన్న తీరుపై ట్రస్టీల్లో ఒకరైన ప్రముఖ పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్ ఇటీవల మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. టాటా సన్స్ నామినీలు, ప్రతినిధుల నియామకం వంటి వాటికి సంబంధించి ఎస్‌డీటీటీ నిర్ణయాల్లో నోయెల్ టాటా పాలుపంచుకోకుండా, ఓటు వేయకుండా ఆంక్షలు విధించాలని కోరారు. ట్రస్ట్, దాని నిర్వహణ బృందం, ఛైర్మన్ నోయెల్ టాటా.. టాటా సన్స్ వాణిజ్య వ్యవహారాలు, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈక్విటీ లిక్విడిటీ చర్చల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ట్రస్ట్ ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తంచేశారు. వాణిజ్య లావాదేవీల్లో నమోదిత లాభాపేక్ష రహిత సంస్థలు నేరుగా పాల్గొనడం, ఆదాయపు పన్ను నిబంధనలు ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. అలా జరిగితే ట్రస్ట్‌కు భారీగా నష్టం జరుగుతుందనే విషయాన్న ప్రస్తావించారు.
పాలనాపరమైన వ్యవహారాల్లో నోయల్ పెత్తనం తగ్గించాలని పిటిషన్..
టాటాల ఆధ్వర్యంలోని ట్రస్ట్‌లు చట్టబద్ధంగా నడుస్తున్నాయా లేదా..? అని మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తుంటారు. తాజాగా వేణు శ్రీనివాసన్ ఫిర్యాదు నేపథ్యంలో అక్టోబర్ 19లోగా నోయెల్ సమాధానం చెప్పాల్సి ఉంది. దీంతో నోయల్ టాట కెవియట్ పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. టాటా ట్రస్ట్స్‌కు నోయెల్ టాటా ఛైర్మన్. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో ఈ ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. టాటా ట్రస్ట్స్ ఆధ్వర్యంలో 15 దాతృత్వ సంస్థలు ఉండగా.. అందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కీలకమైనవి. టాటా సన్స్‌లో ఆ రెండింటి వాటానే 51.54 శాతంగా ఉంది. అందుకే ఈ ట్రస్ట్‌ల అభిప్రాయాలు టాటా సన్స్ పాలనా విధానాలపై ప్రభావం చూపుతుంటాయి.
ఇంతకీ టాటా సంస్థలో చోటుచేసుకున్న ఆదిపత్యపోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థలో ఆదిపత్య పోరాటం మంచిది కాదని, దాతృత్వ సంస్థల్లో ఏకాభిప్రాయలేమి సంస్థ ప్రతిష్టకు, ప్రగతికి అవరోధంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.