Heart Attack: గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపించడం గుండె ప్రధాన పని. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. వాటిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.
1/7
ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి
గుండెపోటుకు ముందు ఛాతిలో నొప్పి, బరువుగా అనిపించడం, ఒత్తిడి ఉన్నట్లు అనిపించవచ్చు. కొందరికి ఛాతిలో మంటగా కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా తగ్గి మళ్లీ రావచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఇదే లక్షణం కనిపించకపోవచ్చు.
2/7
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఎక్కువగా పని చేయకపోయినా, నడుస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఛాతి నొప్పితో పాటు ఈ సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
3/7
చేతులు, భుజాలు, దవడలో నొప్పి
గుండెపోటు సమయంలో ఛాతిలో మొదలైన నొప్పి చేతులు, భుజాలు, వీపు, మెడ లేదా దవడకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా ఎడమ చేతిలో నొప్పి వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ కొందరిలో ఇతర భాగాల్లో కూడా నొప్పి కనిపించే అవకాశం కూడా ఉంది.
4/7
చల్లని చెమటలు, వికారం
ఎటువంటి కారణం లేకుండా చల్లని చెమటలు పట్టడం, వాంతులు వచ్చినట్లు అనిపించడం, తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కొందరిలో తీవ్రమైన అలసట కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణం కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
5/7
అసాధారణమైన అలసట
సాధారణ పనులు చేసినా ఎక్కువగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు సమయంలో ఛాతి నొప్పితో పాటు లేదా ఛాతి నొప్పి లేకుండానే ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు.
6/7
గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
ప్రతిరోజూ తగినంత నడవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తినకుండా ఉండడం, ధూమపానానికి దూరంగా ఉండడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అవసరం.
7/7
ముఖ్యమైన విషయం
ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు వంటి గుండెపోటు అనుమాన లక్షణాలు కనిపిస్తే అవి తగ్గుతాయేమోనని వేచి చూడకండి. వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. భారతదేశంలో 112కు కాల్ చేయవచ్చు. లక్షణాలను బట్టి గుండెపోటును వైద్యులు పరీక్షల ద్వారా మనకు తెలుపుతారు.