Temple Rush: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. భక్తులతో కిటకిట
AP Temples Heavy Rush With Devotees For Karthika Pournami: కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా.. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేసి.. సాయంత్రం కార్తీక దీపారాధన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Karthika Deepotsavam: శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రంలోని తిరుమల వెంకటేశ్వర ఆలయంతోపాటు శ్రీశైలం మల్లికార్జున ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం పూట కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీశైలం ఆలయం
శ్రీశైలంలో కార్తీకమాస లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశ హారతులిచ్చారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చారు.
అన్నవరం ఆలయానికి కార్తీక శోభ
కాకినాడ జిల్లాలోని అన్నవరంలో భక్తుల జయజయ ధ్వానాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మొదలైంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షణ నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం కార్తీకపున్నమిని పరిష్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సహకారంతో అర్చకులు స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పల్లకిపై ఉంచి కొండ దిగువన తొలి పవంచాలకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షణ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఒకవైపు, ఉత్సాహంగా నడుస్తున్న భక్తులు మరోవైపు, భక్తులకు అలసట రాకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల విశేష పూజలు చేశారు. కార్తీకమాసం మూడో మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 'నెల రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు' అని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఉసిరి, రావి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జగ్గయ్యపేట మండలం ముత్యాల క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తుల కృష్ణ నదుల స్థానాలు ఆచరించి దీపారాధనలు చేశారు. అనంతరం స్వామివారి కి పంచమృతలతో అభిషేకాలు నిర్వహించారు.
గోదావరిలో పుణ్యస్నానాలు
మహా పర్వదినం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాజమండ్రి వద్ద గోదావరి తీరంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున వేలాది మంది కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలు చేశారు. దీంతో పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి రోజున చేసే పుణ్యస్నానం కార్తీకమాసం నెలరోజుల ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. చిన్నారులతో కలిసి కుటుంబ సమేతంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అనంతరం నదిలో కార్తీక దీపాలు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. ఆలయాల్లో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి శివనామస్మరణ చేశారు.