India vs New Zealand 5th ODI Highlights: అండర్ -19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై యువ భారత ఆటగాళ్లు అద్భుతం చేసి ట్రోఫీ సాధించగా.. ఆ మరుసటి రోజు సీనియర్ భారత ఆటగాళ్లు అదే స్థాయిలో ఆడి న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో కివీస్‌ను బోల్తా కొట్టించిన టీమిండియా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. స్టార్ ఆటగాళ్లు మరోసారి సత్తా చాటలేకపోవడంతో చేసిన తక్కువ స్కోర్‌ను భారత జట్టు కాపాడుకుంది. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మౌంట్ మాంగనుయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐదో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. 209 పరుగులు చేసి భారత్ 42.1 బంతులకు ఆలౌటైంది. మరోసారి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. రోహిత్ శర్మ(7), విరాట్ కోహ్లి (5) తక్కువ స్కోర్‌కే ఔటవగా.. అక్షర్ పటేల్(46), ఇషాన్ కిషన్(46) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రుతురాజ్ గైక్వాడ్ (18), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22), నమన్ ధిర్ (22) కొన్ని పరుగులు చేయగా.. యశ్ ఠాకూర్ డకౌటయ్యాడు. ఆఖరులో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ బ్యాట్‌తో తలా 14 పరుగులు నమోదు చేశారు.
మరోసారి న్యూజిలాండ్ బౌలర్లు బంతితో భారత్‌ను బెంబేలెత్తించారు. బంతికి మరింత పదును పెట్టిన కివీస్ బౌలర్లు అదగొట్టారు. భారీ స్కోర్ చేయకుండా భారత బ్యాటింగ్ దళాన్ని నిలువరించారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ ఇద్దరూ పొదుపుగా బంతులు వేసి మూడేసి చొప్పున వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బ తీశారు. మ్యాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు తీయగా.. బ్లెయిర్ టిక్నర్, మైకేల్ బ్రాస్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన న్యూజిల్యాండ్ తలపడింది. భారత బౌలర్ల దెబ్బకు తక్కువ లక్ష్యాన్ని కివీస్ ఛేదించలేకపోయింది. భారత బౌలింగ్ దెబ్బకు ఏ ఒక్క బ్యాటర్ కూడా అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయారు. 46 ఓవర్లలో 175 పరుగులకే కివీస్ ఆలౌటైంది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శాంట్నర్ (24), నిక్ కెల్లీ (24) ఫర్వాలేదనిపించారు. కివీస్ బ్యాటర్లపై భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. అకిబ్ నబీ, నమన్ ధీర్, యశ్ ఠాకూర్ కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు.