Kavya Maran SRH Retained Players 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారి మొత్తం పది మంది ఆటగాళ్లను జట్టు నుంచి రిలీజ్ చేసింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్‌కు అందుబాటులో లేకపోవడంతో విడుదల చేసింది. హెడ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకు కూడా SRH వీడ్కోలు పలికింది. మరోవైపు కెప్టెన్ పాట్ కమిన్స్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మరి సన్‌రైజర్స్ ఎవరిని కొనసాగించింది..? ఎవరిని వదులుకుంది..? పర్స్‌లో ఇంకా ఎంత మిగిలి ఉంది..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయాల్లో ట్రావిస్ హెడ్ విడుదల అందరిని షాక్‌కు గురి చేసింది. గతంలో అభిషేక్ శర్మతో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ స్టార్ ఓపెనర్ బ్యాటర్.. ఆస్ట్రేలియా జట్టుకు వరుస సిరీస్‌లు ఉండటంతో పనిభారాన్ని తగ్గించుకోవాలని హెడ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో హెడ్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసింది SRH. 2024 వేలంలో రూ.6.8 కోట్లకు ట్రావిస్ హెడ్‌ను హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2025 మెగా వేలానికి ముందు రూ.14 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇప్పుడు టీమ్ నుంచి నిష్క్రమణతో అభిషేక్ శర్మతో కలిసి ఏర్పడిన విజయవంతమైన ఓపెనింగ్ జోడీకి బ్రేక్ పడింది.
ట్రావిస్ హెడ్‌ను వదులుకున్నా.. సన్‌రైజర్స్ తన ప్రధాన ఆటగాళ్లను కొనసాగించింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను జట్టులోనే ఉంచుకుంది. ఐపీఎల్ 2027 వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ.40.15 కోట్ల పర్స్ ఉంది. మొత్తం ఏడుగురు ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉండగా.. అందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు ఖాళీలు ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..
అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబే, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్, క్రెయిన్స్ ఫులెట్రా, నాథన్ ఎల్లిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, ప్రఫుల్ హింగే, సలీల్ అరోరా, శివాంగ్ కుమార్, స్మరణ్ రవిచంద్రన్, టి.నటరాజన్, సాకిబ్ హుస్సేన్
రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 10 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ట్రావిస్ హెడ్‌తో పాటు కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, గెరాల్డ్ కోయెట్జీ వంటి విదేశీ, భారత ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
SRH రిలీజ్ చేసిన ప్లేయర్లు వీళ్లే..
ట్రావిస్ హెడ్, డేవిడ్ పేన్, దిల్షాన్ మధుశంక, గెరాల్డ్ కోయెట్జీ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, ఓంకార్ తర్మలే, ఆర్.ఎస్.అంబరీష్, శివమ్ మావి, అమిత్ కుమార్
ట్రేడ్ విండోలోనూ..
మినీ వేలానికి ముందే ట్రేడ్ విండోలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మార్పులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను సీఎస్‌కేకు పంపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టి.నటరాజన్‌ను తీసుకుంది. ఇందుకోసం జీషన్ అన్సారీని ఢిల్లీకి ట్రేడ్ చేసింది. ఈ మార్పులతో బౌలింగ్ విభాగంలో కొత్త కూర్పుతో బరిలోకి దిగేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. అయితే ట్రావిస్ హెడ్ అందుబాటులో లేకపోవడంతో టాప్ ఆర్డర్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.