Team India Record Chased: క్రికెట్ చరిత్రలో భారత జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. 400కు పైగా పరుగులు ఛేదించిన జట్టుగా భారత్ అరుదైన ఘనతను సాధించింది. వరుసగా రెండు విజయాలతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ నమోదు చేయగా.. రోహిత్ శర్మతోపాటు వెస్టిండీస్ బ్యాటర్లు ముగ్గురు శతకాలు నమోదు చేశారు. ఐదుగురు శతకాలు నమోదు చేసిన మ్యాచ్‌గా ఇది అరుదైన ఘనత సాధించింది.
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో విఫలమవగా.. ఆ కసినంతా విండీస్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో చూపించారు. ఫలితంగా ముగ్గురు బ్యాటర్లు భారీ శతకాలు నమోదు చేశారు. 77 బంతుల్లో అమిర్ జాంగో 114 పరుగులు చేయగా.. వాటిలో 13 ఫోర్లు, 3 సిక్సర్లు నమోదు చేశారు. 68 బంతుల్లో జాన్ క్యాంప్‌బెల్ 101 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేయగా.. కెప్టెన్ షెయ్ హోప్ 94 బంతుల్లో 104 (8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లను విండీస్ బ్యాటర్లు తీసి పడేశారు. స్టార్ బౌలర్లను కూడా విండీస్ బ్యాటర్లు తేలిపోయేలా చేశారు. కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఛేదనకు దిగిన భారత జట్టు 43.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీర విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్ సునాయాసంగా ఛేదించింది. గిల్ 133 బంతుల్లో 223 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వాటిలో 26 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 75 బంతులకు 101 పరుగులు చేసి శతకాన్ని నమోదు చేశాడు. విరాట్ కోహ్లి 29 పరుగులకు పరిమితం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, షమర్ జోసెఫ్ చెరొక వికెట్ తీశారు.
భారీ ఛేదనతో విజయం సాధించిన టీమిండియా వరుసగా రెండో వన్డేలోనూ విజయం సాధించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. డబుల్‌సెంచరీ సాధించిన కెప్టెన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శనివారం ఛండీఘర్ వేదికగా జరగనుంది.