BRAOU Admissions 2026 Extension: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) లో ప్రవేశాలు పొందాలనుకుంటున్న వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026–2029 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ (UG), 2026–2028 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రవేశాల గడువు ముగియడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. యూనివర్సిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రవేశాల గడువు అక్టోబర్ 13తో ముగిసింది. అయితే, మారుమూల ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకుంటూ దూరవిద్య అభ్యసించాలనుకునే వారు ఇంకా అధిక సంఖ్యలో దూరవిద్యలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
స్టడీ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు:
ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నప్పటికీ.. ఫీజు చెల్లింపు (Fee Payment) లింక్‌లు మూసివేయడంతో అడ్మిషన్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. నిర్ణీత గడువు ముగియడంతో.. ఉన్నత విద్య అభ్యసించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం సహా వివిధ అధ్యయన కేంద్రాల (Study Centers) చుట్టూ తిరుగుతున్నారు.
కొత్త కోర్సులకు కనీస సమయం ఇవ్వలేదు:
ఈ విద్యా సంవత్సరంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అనేక నూతన కోర్సులను ప్రవేశపెట్టింది. అయితే.. కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులపై విస్తృత ప్రచారం జరగకపోవడం.. అలాగే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీస సమయం కూడా ఇవ్వకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని విద్యార్థి సంఘాలు.. ప్రతినిధులు పేర్కొంటున్నారు. గతం లో కూడా అనేక సందర్భాల్లో జనవరి వరకు ప్రవేశాల గడువును పొడిగించిన దాఖలాలు ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు.
అధికారులను కోరుతున్న విద్యార్థులు:
విద్యార్థుల భవిష్యత్తును.. ఉన్నత విద్యావకాశాలను దృష్టిలో ఉంచుకొని, 2026–2028 విద్యా సంవత్సరానికి అన్ని గ్రూపుల్లోని UG, PG కోర్సులలో ప్రవేశం పొందేందుకు మరోసారి అడ్మిషన్ గడువును పొడిగించాలని విశ్వవిద్యాలయ అధికారులను విద్యార్థులు కోరుతున్నారు. ప్రవేశ గడువును పెంచడం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని.. వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ అడ్మిషన్లను పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
యూనివర్సిటీ పాలకమండలి.. ఉన్నతాధికారులు ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి త్వరలోనే అడ్మిషన్ పోర్టల్‌ను తిరిగి ప్రారంభించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.