SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

OBC Caste Census: ఓబీసీ కులగణనపై బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం.. కేటీఆర్‌ ప్రకటన

BRS Party Announces Full Support To OBC Caste Census: దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే కులగణన తప్పనిసరి అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓబీసీ విద్యార్థులకు మద్దతునిచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 20, 2026, 22:27 IST | Updated: Nov 20, 2026, 22:29 IST
Image Credit: KTR With OBC Students
Join

KT Rama Rao: ఓబీసీ కులగణనకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే కులగణన తప్పనిసరి అని పేర్కొన్నారు. బీసీల విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యానికి కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని గుర్తుచేశారు. బీసీ, బహుజన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ పాలనలో అనేక కార్యక్రమాలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఓబీసీ కులగణనకు మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్లు జయంత్ యాదవ్, రజినీకాంత్ గౌడ్, మురళీకృష్ణ, చిద్విలాస్, కిరణ్, లోకేష్ తదితరులు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓబీసీ కులగణనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరగా.. కేటీఆర్ వారి విజ్ఞప్తిని మన్నించి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో గతంలోనే కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఈ సందర్భంగా బీసీ విద్యార్థి నాయకులకు మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశాలు కల్పించడంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎంబీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. శాసనమండలి తొలి చైర్మన్‌గా కూడా బీసీ నాయకుడికి అవకాశం కల్పించామని గుర్తుచేశారు. బీసీల్లో రాజకీయ చైతన్యం పెంచి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే తపన కేసీఆర్‌కు ఉందని మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన జరగడం అత్యవసరమని స్పష్టం చేశారు.

కులగణన అంశంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారని గుర్తుచేసిన కేటీఆర్‌.. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపడితేనే వివిధ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రాతిపదిక ఏర్పడుతుందని వెల్లడించారు. 'కేసీఆర్ పాలనలో బీసీలు, బహుజనుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, కులవృత్తుల పరిరక్షణ, సామాజిక గౌరవానికి పెద్దపీట వేశాం. బీసీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని విశ్వసించిన కేసీఆర్, ఆ వర్గాలకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాధాన్యం కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

'దాదాపు వెయ్యి గురుకులాలను ఏర్పాటుచేసి పేద బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో వివిధ బీసీ కుల సంఘాలకు భవనాల నిర్మాణం కోసం భూములు కేటాయించి, నిధులు మంజూరు చేసి ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సంఘ భవనాలు నిర్మించాం. బీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమాలను ప్రోత్సహించాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

ముదిరాజ్, గౌడ, యాదవ, కురుమ, మత్స్యకార, రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర తదితర వృత్తి ఆధారిత బీసీ కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేశాం. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు, ముదిరాజ్, గంగపుత్రులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీతోపాటు మోపెడ్లు, వాహనాల పంపిణీ, యాదవులకు రాయితీతో గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాం' అని ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులకు మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. బీసీలకు విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే వారి జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కచ్చితమైన సమాచారం అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES