CM Revanth reddy: కృత్రిమ కొరత సృష్టిస్తే తాటతీస్తాం.. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వార్నింగ్..
Rice prices hike in Telangana: ఎల్ నినో ప్రభావంను సాకుగా చూపిస్తు కొంత మంది వ్యాపారులు బియ్యం ధరల్ని అమాంతం పెంచేశారు. దీంతో ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
CM Revanth reddy govt warns to rice millers amid elnino row: తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. తాగు నీటిని జాగ్రత్తగా వినియోగించుకొవాలని సూచించారు. అంతే కాకుండా రైతన్నలకు సైతం సాగునీటి కొరతపై కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో ఎల్ నినో ప్రభావంను సాకుగా చూపుతూ పలు ప్రాంతాల్లో బియ్యం ధరల్ని మిల్లర్లు, వ్యాపారులు అమాంతంపెంచేశారు. దీంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలు లబో దిబో మంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ బియ్యం మాఫీయా, నిత్యావసరాల పెరుగుదలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఈక్రమంలో రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరగకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని సివిల్ సప్లై భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ నేతృత్వంలో మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో ఈ సమావేశం నిర్వహించారు. మార్కెట్లో బియ్యం కొరత లేకుండా చూడాలని, వినియోగదారులకు అందే ధరలను అదుపులో ఉంచాలని ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం నిల్వలన్నీ గత సీజన్‌కు చెందినవే కాబట్టి, ధరలను అమాంతం పెంచడానికి వీల్లేదని అధికారులు వ్యాపారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా బియ్యాన్ని గోదాముల్లో దాచిపెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తెల్చి చెప్పారు. వ్యాపారుల లాభాపేక్ష వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు.
ధరలను అదుపులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలని మిల్లర్లకు, యజమానులకు అధికారులు సూచించారు. పరిస్థితిని బట్టి మార్కెట్లో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు తెరిచి బియ్యం విక్రయం చేపడుతుందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను పర్యవేక్షిస్తూ, అక్రమాలకు తావులేకుండా పౌర సరఫరాల శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు.