SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హరీశ్ రావు అసలు గురువు కేసీఆర్ కాదు.. వైఎస్ఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

CM Revanth Reddy: నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Written By Bhoomi
Published: Nov 23, 2026, 21:13 IST | Updated: Nov 23, 2026, 21:15 IST
Image Credit: CM Revanth Reddy
Join

CM Revanth Reddy: నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము పరిపాలనాపరమైన అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా.. బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అసత్య ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఆధారాలతో సహా బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై తీవ్ర ఆరోపణలు:
ఆంధ్రప్రదేశ్‌కు తాము నీటిని దోచిపెడుతున్నామంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. గతంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్న సమయంలోనే (2022 ఫిబ్రవరిలో) జల్ జీవన్ మిషన్ కింద రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీవో విడుదలైందని సీఎం గుర్తు చేశారు. 2024 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని నాడు జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ, అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఒక్కసారి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయం తమ దృష్టికి రాగానే, వెంటనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కేంద్ర జలశక్తి శాఖకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని సీఎం వెల్లడించారు.

హరీశ్ రావుపై సెటైర్లు.. పోతిరెడ్డిపాడు ప్రస్తావన:
మాజీ మంత్రి హరీశ్ రావుకు అసలైన రాజకీయ గురువు కేసీఆర్ కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్ రావును వైఎస్ఆర్ మంత్రిని చేశారని, అందుకు గురుదక్షిణగా 2005లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని సీఎం ఆరోపించారు. జీవో నెం.170 విడుదలయ్యే సమయానికి తాను మంత్రి పదవిలో లేనని హరీశ్ రావు చెబుతున్నప్పటికీ, 2005 మార్చి బడ్జెట్‌లోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని సీఎం పేర్కొన్నారు. అప్పటి కేబినెట్ ఆమోదంలో హరీశ్ రావుతో పాటు ఐదుగురు టీఆర్ఎస్ మంత్రులు కూడా భాగస్వాములుగా ఉన్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా 2005లో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు అనుమతులు ఇచ్చి, రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే హరీశ్ రావు హారతులు పట్టారని సీఎం విమర్శించారు.

కృష్ణా జలాల వాటాపై విమర్శలు:
తెలంగాణ నీటి హక్కులకు కేసీఆర్, హరీశ్ రావులే సమాధి కట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల వాటా దక్కాల్సి ఉండగా, 2015 జూన్ 26న జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ సంతకం చేశారని సీఎం ఆరోపించారు. ఆ తర్వాత 2020 జనవరి 29న కూడా ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీల నీరు వెళ్లేలా సంతకాలు చేయడం వల్ల తెలంగాణ 276 టీఎంసీల నీటిని నష్టపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేలా కేసీఆర్ చేసిన సంతకాలే కారణమయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో నీటి వినియోగం.. ప్రాజెక్టుల పెండింగ్:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలను అత్యధికంగా వినియోగించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. ఒప్పందం ప్రకారం తెలంగాణకు 34 శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ, 2024-25లో 285 టీఎంసీలు, ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 110 టీఎంసీలు (45.44 శాతం) నీటిని వాడుకున్నామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రాజెక్టులను పూర్తి చేసుకోగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ వాస్తవాలన్నీ ఆధారాలతో బయటపెట్టకముందే కేటీఆర్, హరీశ్ రావు ఊరూరా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనం బంగారం కొనకపోతే రేట్లు దిగొస్తాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలను శాసించే అసలు శక్తులు ఏవో తెలిస్తే షాకవుతారు..!!

 

 

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.. బ్యాంకు SMS ల వెనుక అసలు కథ ఇదే..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES