మితిమీరిన పర్యవేక్షణలతో ఆత్మగౌరవంపై దెబ్బ.. విద్యాశాఖ నిర్ణయాలపై ఉపాధ్యాయుల తీవ్ర ఆవేదన!
Education System Issues Telangana: విద్యా వ్యవస్థలో అత్యంత కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు తీవ్రమైన ఆవేదన, నిస్సహాయత మధ్య విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాణ్యమైన విద్యాబోధన కోసం వారు పడుతున్న తపన, విద్యాశాఖ అమలు చేస్తున్న వరుస పర్యవేక్షణల కారణంగా నీరుగారిపోతోందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Education System Issues Telangana: విద్యా వ్యవస్థలో అత్యంత కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు తీవ్రమైన ఆవేదన, నిస్సహాయత మధ్య విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాణ్యమైన విద్యాబోధన కోసం వారు పడుతున్న తపన, విద్యాశాఖ అమలు చేస్తున్న వరుస పర్యవేక్షణల కారణంగా నీరుగారిపోతోందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ఏర్పాటు చేసిన పలు బృందాల పర్యవేక్షణల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా, ఉపాధ్యాయుల్లో బోధన పట్ల ఆసక్తి పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఏర్పడిందని వాపోతున్నారు. ఈ మితిమీరిన పర్యవేక్షణలతో బోధనకే ప్రమాదం పొంచి ఉందని ఎం.వి. ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి వంటి విద్యావేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఉన్నతాధికారులకు ఏమి కావాలో అవే నివేదికల రూపంలో పైకి పంపాల్సిన దయనీయ స్థితిలో ఉపాధ్యాయ లోకం నెట్టివేయబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు విద్యా సామర్థ్యాల సంక్షోభం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ తరహా పర్యవేక్షణలు ఉపాధ్యాయుల చిత్తశుద్ధికి, నిజాయితీకి, నైతిక నిబద్ధతకు సవాల్‌గా మారుతూ వారి ఆత్మగౌరవంపై ఒక మచ్చగా పరిణమిస్తున్నాయి.
పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. వాటిని మౌనంగా అంగీకరిస్తూ విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులను బోధనేతర పనులు మరింత కుంగదీస్తున్నాయి. ప్రతిరోజూ గంటల తరబడి బోధనేతర డిజిటల్ నివేదికలు నమోదు చేయడానికే వారి సమయం అంతా వృథా అవుతోంది. బోధనను ఒక సవాల్‌గా తీసుకోవాల్సిన వారు.. ఈ నివేదికల భారంతో తమ ప్రాథమిక హక్కు అయిన 'బోధన'ను రోజురోజుకూ కోల్పోవడం విచారకరం. ఇదంతా ఒక సమూహంగా కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగా తీవ్రమైన మానసిక ఆందోళన, నిస్సహాయతను అనుభవిస్తున్నారనేది కాదనలేని కఠోర వాస్తవం.
కనీసం ఈ సమస్యల గురించి మండల, జిల్లా స్థాయి అధికారుల సమావేశాల్లో చర్చిద్దామన్నా అక్కడ ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఉపాధ్యాయులు ధైర్యం చేసి మాట్లాడితే, దానిని ఆజ్ఞాధిక్కారం కింద పరిగణిస్తున్నారు తప్ప, ఎలాంటి చర్చకు తావు లేకుండా పోయింది. దీంతో వ్యవస్థలో ఇక మార్పు రాదని పూర్తిగా నిరాశచెందిన కొందరు ఉపాధ్యాయులు.. కేవలం పైనుంచి వచ్చే ఉత్తర్వులను గుడ్డిగా అమలు చేసే యంత్రాలుగా మారిపోయారు. మరికొందరు మాత్రం విద్యా వ్యవస్థ బాగు కోసం ఇంకా అలుపెరగని ఆరాటం పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు, ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయ లోకం మౌనం వహించడం విద్యా వ్యవస్థకే అత్యంత ప్రమాదకరమని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నారు.