ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో 18 జిల్లాల్లో 320 మండలాల్లో కరువు..
Telangana State: రాష్ట్రంలో ఎల్‌నినో పంజా విప్పినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తేల్చింది. వీటితో పాటు ఈనెల రెండో వారం వరకు పరిస్థితులను గమనించి, కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించేందుకు, నిర్ధేశించిన ప్రామాణిక అంశాల ప్రకారం సమగ్రంగా పరిశీలించి అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు.
El Nino Drought: గత కొన్నేళ్లలో ఎన్నడు లేనట్టుగా దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఇక ఋతు పవనాల సీజన్ ముగయడంతో ఈ సీజన్‌లో వర్షపాతం లేనట్టే అని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఎల్ నినో ప్రభావంతో చలి ఉండాల్సిన ఈ సమయంలో వేసవిలా ఉక్కబోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరువు మండాలను గుర్తించే పనిలో పడింది కేంద్రం. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షపాతం ఆధారంగా కరువు మండలాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
సమగ్ర అధ్యనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. కరువు తీవ్రత, దాని ప్రభావం, వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువు ప్రభావిత మండలాలను గుర్తించనున్నారు. ఇందుకోసం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగిన నైఋతి రుతుపవనాల కాలంలో నమోదైన వర్షపాతం, వర్షాల లోటు, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఇందుకోసం ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జలాలు, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించాలని సీఎస్ ఆదేశించారు.
కరువును నిర్ధారించేందుకు 12 ప్రామాణిక అంశాలు..
కరువు పరిస్థితులను నిర్ధారించేందుకు కేవలం వర్షపాతం లోటునే ప్రాతిపదికగా తీసుకోకుండా 12 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఆయా ప్రమాణాల ఆధారంగా మండలాల వారీగా కరువు తీవ్రతను అంచనా వేసి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. పంటల పరిస్థితి, భూగర్భ జలాలు, తాగునీటి లభ్యత వంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయి వివరాలను నివేదికలో పొందుపరచనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా కరువు ప్రభావిత మండలాలను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని సమన్వయం చేసి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తుది నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
తీవ్రమైన ఎల్ నినో ప్రభావం..
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. అఖిలపక్ష సమావేశంలో చర్చించేందుకు అవసరమైన వర్షపాతం, సాగు, తాగునీరు, భూగర్భ జలాలు, కరువు తీవ్రత తదితర అన్ని వివరాలను నివేదికలో పొందుపరచాలని సీఎస్ సూచించారు. అక్టోబర్ మాసాంతంలోగా నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్యదర్శులు దాసరి హరిచందన, గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.