SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Konda Surekha: కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. కొండా సురేఖ సంచలన ట్వీట్..!

Konda Surekha Tweet on KTR: మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ కుటుంబానికి కలిగిన బాధకు విచారం వ్యక్తం చేశారు.

Written By Ashok Krindinti
Published: Oct 29, 2026, 11:50 AM IST | Updated: Oct 29, 2026, 11:53 AM IST
Image Credit: Konda Surekha Tweet on KTR (Source: AI)
Join

Konda Surekha Tweet on KTR: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. తన మాటల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. గతంలో చేసిన కామెంట్స్‌కు ఇప్పుడు కొండా సురేఖ ఎందుకు రియాక్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి పోవడంతో ఆమె మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా..? అనే చర్చ మొదలైంది.

కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో తన వైఖరి స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో తాను కొన్ని వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్నారు. కేటీఆర్‌ను గానీ.. ఆయన కుటుంబ సభ్యులను గానీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టాలనే ఆలోచన తనకు లేదని వివరించారు. వారి వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం కలిగించాలనే దురుద్దేశం కూడా లేదని పేర్కొంటూ గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

 

గతంలో కేటీఆర్‌పై ఏమన్నారు..?

కొండా సురేఖ గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. 2024 ఏప్రిల్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్లను ట్యాప్ చేసి, హీరోహీయిన్లను బ్లాక్‌మెయిల్ చేశారంటూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో నిరాధార ఆరోపణలు చేసినందుకు ఎన్నికల సంఘం 2024 ఏప్రిల్‌లో కొండా సురేఖను తీవ్రంగా మందలించింది. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ఆ తర్వాత 2024 అక్టోబర్‌లో సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆమె చేసిన ఆరోపణలు మరో వివాదానికి కారణమయ్యాయి. ఈ కామెంట్స్‌పై సమంత, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొండా సురేఖ సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరిస్తూ.. ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే అప్పట్లో కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను మాత్రం వెనక్కి తీసుకోవడం లేదని ఆమె ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా కేసు కూడా వేసిన విషయం తెలిసిందే.

తాజాగా చేసిన పోస్టులో మాత్రం గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో తన వైఖరిని చెప్పారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని.. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంగీకరించారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కించపరచడం లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల వారు మనస్తాపానికి గురై ఉంటే విచారం వ్యక్తం చేస్తూ.. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ వెనక్కి తగ్గినట్లయింది. ఆమె తాజా ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES