Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్..! పాలమ్మినా, పూలమ్మినా.. అంటూ ఆయన చెప్పే డైలాగులు అందరికి తెలుసు.. ఇప్పడాయన పార్టీ మారేందుకు సిద్దమైనట్టు ప్రచారం సాగుతోంది. మాజీమంత్రి మల్లారెడ్డి కాషాయ పార్టీ నేతలతో ఆస్ట్రేలియాలో చర్చలు జరిపిపట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా తమ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు కావాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ ను కోరినట్టు తెలిసింది. అలాగే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ అంశంపైన చర్చలు జరిపారట. ఈ ప్రతిపాదలనకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీ లో చేరేందుకు రెడీ అన్నట్టుగా కాషాయ పార్టీ పెద్దలతో చెప్పినట్టు సమాచారం. అయితే మల్లారెడ్డి ప్రతిపాదనలకు టీబీజేపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో.. త్వరలోనే కుటుంబంతో కలిసి కండువా కప్పుకునేందుకు ఓకే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయాక.. మాజీమంత్రి మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి ఆసక్తి చూపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. అంతేకాదు.. మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చి వేయాలంటూ ఆదేశాలిచ్చారు. దాంతో మల్లారెడ్డి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అప్పట్లో మల్లారెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ కూడా ససేమీరా అనడంతో.. బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక్కడే మల్లారెడ్డి అసలైన రాజకీయం చేశారు. తన కోడలు ప్రీతిరెడ్డిని రంగంలోకి దింపారు. మల్లారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లి.. ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత.. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లడం లాంటి ఘటనలు చకచక జరిగాయి. మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి మల్లారెడ్డి వంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతలు అవసరంగా భావిస్తోంది. అలాగే ఆర్థిక వనరులు, విద్యాసంస్థల నెట్‌వర్క్ ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వస్తే, అది పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు కాషాయ పార్టీలో చేరి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ఆలోచనలో మాజీమంత్రి మల్లారెడ్డి ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం మల్లారెడ్డికి రెండు టికెట్ల హామీతో పాటు.. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొడుకును ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. అలాగే కోడలు ప్రీతిరెడ్డిని మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయిస్తే.. తనకు తిరుగుండదని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. కానీ రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన రాష్ట్ర బీజేపీ చీఫ్.. ఎంపీ టికెట్ విషయంలో మాత్రం.. క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయన్ను పక్కనపెట్టి.. మల్లారెడ్డి కోడలు ఎంపీ టికెట్ ఇవ్వడం ఆసాధ్యమనే చర్చ జరుగుతోంది. అందుకే ఎంపీ టికెట్ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో రాష్ట్ర చీఫ్ ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ప్రీతిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీలో దిగితే.. మరో టికెట్ కేటాయించే అంశంపైన బీజేపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో బీజేపీ పెద్దలు మల్లారెడ్డికి క్లారిటి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.. ఆ తర్వాతే.. మల్లారెడ్డి కుటుంబంతో కలిసి కాషాయ కండువా కప్పుకునే ఉందని అంటున్నారు..
ప్రస్తుతం మల్లారెడ్డి వ్యవహారం కారు పార్టీలోనే ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో మాల్లారెడ్డి వ్యవహారంపై కారు పార్టీ పెద్దలు కూడా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. అయితే మల్లారెడ్డితో పాటు.. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారతారా.. లేక కారు పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం.. పార్టీ మారే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఇటీవల మల్లారెడ్డి కోడలు.. ప్లెక్సీ వ్యవహారం కారు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలు చింపివేశారు. ప్రీతిరెడ్డి బర్త్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో లేదని బీఆర్ఎస్ నేతలు గుస్సా అయ్యారు. ఆ తర్వాత.. బీఆర్ఎస్ నేతలపై ప్రీతిరెడ్డి సీరియస్ అయ్యారు.. తన అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే.. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఎందుకు పెట్టాలని ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యాకే.. ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటారని ప్రచారం సాగుతోంది.
మొత్తంమీద కారు పార్టీకి దూరమవుతున్న మల్లారెడ్డి కుటుంబం.. కాషాయ పార్టీకి దగ్గరవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీకి మూడు టికెట్లు ఇస్తారా.. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ సీటుపై ఎలా సర్ధి చెబుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు మల్లారెడ్డి కాషాయ పార్టీలో చేరితే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కారు పార్టీ కూడా ఇప్పటినుంచే కీలక నేతలతో చర్చలు సైతం పూర్తి చేసినట్టు ప్రచారం సాగుతోంది.