Palandu Water Grid Project: 'పల్నాడు ప్రాజెక్టుపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. కేఆర్‌ఎంబీ- కేంద్రానికి సమాచారం లేకుండా ఏపీ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతుంది. కృష్ణా - గోదావరిలో ఏపీ తన వాటా కంటే ఎక్కువ వాడుకుంది. మూడు నెలల్లో 90 లక్షల మంది 9 టీఎంసీల తాగునీళ్లు తాగుతారా? తెలంగాణ ప్రజలకు కు చంద్రబాబు మోసం చేస్తున్నారు' అని మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఏపీ దోచుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు సహకరిస్తున్నారని తెలిపారు. 'శ్రీశైలం నుంచి ఇప్పటికే వేల టీఎంసీలు దోచుకుపోతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేయకపోతే.. బీఆర్‌ఎస్ పార్టీ కొట్లాడుతుంది' అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్‌ను బీఆర్‌ఎస్ పార్టీ బృందం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందించింది. ఏపీ చేపట్టిన పల్నాడు గ్రిడ్ పనులు ఆపివేయించాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. అనంతరం జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ పెట్టి పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటించారు. 'పేలుళ్లు జరుగుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? 24 గంటల పాటు కమీషన్లు లెక్కపెట్టడంలో బిజీగా ఉన్నారా? ఇంటలిజెన్స్ రిపోర్ట్ చూసిన రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారు? మూడేళ్ల నుంచి పొలాలు ఎండుతూనే ఉన్నాయి ఎందుకు?' అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎండిన పొలాలు కనిపించకపోతే మాతో వస్తే చూపిస్తామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
'ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంది. హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. భవిష్యత్‌లో తాగునీటి సమస్య రావొద్దు అంటే ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపాలి. కేసీఆర్ హయాంలో ఉన్న లైన్‌లలో నీళ్లు హైదరాబాద్‌లో రావడం లేదు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను ఆపాలి' అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
'రేవంత్ రెడ్డి చేతగానితనంతో ఏపీ అక్రమంగా నీళ్లను తరలిస్తుంది. పల్నాడు ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతి లేదు. బీజేపీ - కాంగ్రెస్ కుమ్మక్కై హైదరాబాద్‌కు నీళ్ల కష్టాలు తెస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. రేవంత్ రెడ్డికి- ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీసం గూగుల్ చూసే టైం లేదా?' అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.