Revanth Reddy EMI CM: రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి.. ఈఎంఐలు కట్టకపోతే పదవి పోతుంది: కేటీఆర్
Revanth Reddy Is EMI Chief Minister: మరోసారి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఈఎంఐ ముఖ్యమంత్రి అని.. ఢిల్లీకి ఈఎంఐలు పంపకపోతే పదవి పోతుందనే భయం ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇంకేమన్నారంటే..
BRS Party: ఎల్నినోపై ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. దేనిపైన అయిన విచారణకు సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని.. కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయంతోనే కమీషన్లు దండుకుంటున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఆ పదవి కాపాడుకునేందుకు విదేశీ బొగ్గు కొనుగోళ్లలో కమీషన్లకు కుట్ర అని ఆరోపించారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి, విద్యుత్, సాగునీటి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలకు గట్టి బదులు ఇచ్చారు. సింగరేణి, విదేశీ బొగ్గు కొనుగోళ్లలో కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 'రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేం చేస్తున్న ఇతర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. సంక్షోభాన్ని సృష్టించి.. పరిస్థితి చేయి దాటాక బొగ్గు తెస్తామంటూ, విద్యుత్ కొంటామంటూ రేవంత్ నాటకాలు. సింగరేణి బొగ్గు కొనుగోళ్లలోనే కాదు రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపైన న్యాయ విచారణ చేయించాలి. సింగరేణి కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సింగరేణి, విద్యుత్, సాగునీటి సంక్షోభాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని స్పష్టం చేశారు. సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఉత్తరం రాస్తే విచారణకు ఆదేశిస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం కాదని.. మీడియా ముందు ప్రకటనలు చేయడం కాకుండా వాస్తవంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో తన బామ్మర్ది ప్రమేయంతో జరిగిందని తాము ఆరోపిస్తున్న రూ.10 వేల కోట్ల కుంభకోణంపైనా విచారణ చేయించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న సోలార్ పవర్ కుంభకోణాన్ని కూడా బయటపెడతామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఒకప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరాకు అండగా నిలిచిన సింగరేణినే ఇప్పుడు రేవంత్ రెడ్డి బదనాం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కమీషన్ల కోసం మాత్రమే విదేశీ బొగ్గు కోసం ప్రయత్నం చేస్తున్నారని.. సంక్షోభాన్ని ముందుగా సృష్టించి పరిస్థితి చేయి దాటిన తర్వాత బొగ్గు తెస్తామని, విద్యుత్ కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్కు చెల్లించాల్సిన ఈఎంఐలను వసూలు చేసేందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఉన్నారని, రికవరీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కమీషన్లు చెల్లించకపోతే రేవంత్ రెడ్డి పదవిని తొలగించే పరిస్థితి ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సొమ్ములు పంపకపోతే రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదనే భయంతోనే అనేక కుంభకోణాలు, కమీషన్ల వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శించారు.