SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజ్‌ కుప్పకూలలేదు.. కాంగ్రెస్‌ అబద్దాల ప్రచారం

Vemula Prashanth Reddy Statement Medigadda Barrage Not Collapsed: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 03, 2026, 09:45 PM IST | Updated: Nov 03, 2026, 10:28 PM IST
Image Credit: Source: Vemula Prashanth Reddy X (Twitter)
Join

BRS Party: 'కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ చెక్కుచెదరలేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ ద్వారా గోదావరి నీళ్లను ఎత్తిపోసి ఎస్సార్‌ఎస్పీ, నిజాం సాగర్ ప్రాజెక్టులను నింపాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత–గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య  గోదావరి  బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో  పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

'మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి. మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు. రెండు, మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు చేయాల్సి ఉండగా.. మూడేళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బాగు చేయడం చేతకాదు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

'ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోంది. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ, నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని.. నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశం ఉందని వెల్లడించారు.

గోదావరి ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే రేవంత్‌ రెడ్డి దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని విమర్శించారు. గోదావరి జలాలను వృథాగా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు.

చేతగాక రేవంత్‌ రెడ్డి నీటిని దిగువకు వదిలేస్తుంటే చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. నీళ్లు ఎత్తిపోయకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, పుట్ట మధు, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES