Byreddy Siddharth Reddy: అధికారం లేదు.. అధికారంలోని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా బెదరలేదు.. తొణకలేదు. తన సొంత అడ్డాలో తన బలమేమిటో.. తన సత్తా ఏమిటో యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూపించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసేందుకు వెనుకంజ వేయగా.. ఒక్క నందికొట్కూరులో మాత్రం హోరాహోరీగా తలపడింది. నామినేషన్ మొదలుకుని ఎన్నికల ఫలితాల వరకు అన్నీ తానై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహరించాడు. అతడి వ్యూహానికి.. అతడి నాయకత్వ పటిమకు నందికొట్కూరు సలామ్ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అనే బదులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకున్నాడని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేయగా.. నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. 23 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. అధికార తెలుగుదేశం పార్టీ 9 వార్డులకు మాత్రమే పరిమితమైంది. ఏపీలో జరిగిన మొత్తం 87 మున్సిపాలిటీల్లో కన్నా నందికొట్కూరులో జరిగిన ఎన్నికలే హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక టీడీపీ మిత్రపక్షాలు బీజేపీ, జనసేన పార్టీలు ఖాతానే తెరవలేదు.
అధికార కూటమికి భారీ షాక్
నందికొట్కూరు మున్సిపాలిటీ ఫలితం అధికారంలోని టీడీపీ కూటమికి భారీ షాక్‌గా చెప్పవచ్చు. అధికారంలో ఉండీ కూడా మున్సిపాలిటీలో గెలవకపోవడంతో కూటమి శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా టీడీపీ ఉన్నా కూడా స్థానిక మున్సిపాలిటీని సొంతం చేసుకోకపోవడం గమనార్హం. టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేకపోయారు. కూటమి రాజకీయం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహం ముందు పనిచేయేదు.
నందికొట్కూరు అడ్డాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సరికొత్త రాజకీయం చేస్తున్నాడు. నిరంతరం ప్రజల్లో ఉండడం.. ముఖ్యంగా యువతతో సిద్ధార్థ రెడ్డి కలిసిపోయి.. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాడు. అధికారం పోయినా కూడా నందికొట్కూరును సిద్ధార్థ రెడ్డి వదలలేదు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ స్థానానికి రిజర్వ్ కావడంతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆర్థర్ పోటీ చేసినా అతడి గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. ఇక అనంతరం జరిగిన మున్సిపాలిటీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిద్ధార్థ రెడ్డి తన చాణక్యంతో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మళ్లీ పార్టీని గెలిపించి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన ప్రాబల్యాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా సిట్టింగ్ మున్సిపాలిటీని నిలబెట్టుకున్నాడు. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయం అందించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశాకిరణంలా సిద్ధార్థ రెడ్డి కనిపిస్తున్నాడు.