52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి!
GO 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన చదువు ఉచితంగా అందుతుందనే ఆశతో వేలాది పేద కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ నిబంధనలే నేడు వేలాది పాఠశాలలను, ఉపాధ్యాయులను తీవ్ర సంక్షోభంలోనికి నెట్టివేశాయి.
GO 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన చదువు ఉచితంగా అందుతుందనే ఆశతో వేలాది పేద కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ నిబంధనలే నేడు వేలాది పాఠశాలలను, ఉపాధ్యాయులను తీవ్ర సంక్షోభంలోనికి నెట్టివేశాయి.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్దుబాటు.. పాఠశాలల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 25ను తీసుకొచ్చింది. అయితే తరగతుల సంఖ్య లేదా బోధించాల్సిన సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగానే ఉపాధ్యాయులను పరిమితం చేసేలా ఈ జీవో నిబంధనలు ఉన్నాయి. ఈ విధానం ప్రాథమిక విద్య పునాదులనే కదిలించి వేసింది.
తీవ్ర ఒత్తిడిలో 52 వేల మంది టీచర్లు:
ఈ జీవో అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 48 వేల మంది ఎస్జీటీ (SGT) ఉపాధ్యాయులు.. 4 వేల మంది హెడ్ మాస్టర్లు కలిపి మొత్తం 52 వేల మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో టీచర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న అన్ని సబ్జెక్టులను ఒకే సమయంలో బోధించాల్సి వస్తోంది. ఒకవైపు 5 తరగతుల నిర్వహణ, మరోవైపు మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, రికార్డుల నమోదు వంటి పనులతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం పక్కన పెట్టి తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు.
రాష్ట్రంలో ఏకంగా 4,793 పాఠశాలలు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. ఒకే టీచర్ 5 తరగతుల పిల్లలకు ఒకే గదిలో లేదా పక్క పక్క గదుల్లో చదువు చెప్పడం ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. సుమారు 7,000 బడుల్లో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు సెలవులో వెళ్తే ఆ పాఠశాల నిర్వహణ స్థంభించిపోతోంది. దాదాపు 12 వేలకు పైగా పాఠశాలలు తీవ్ర ఉపాధ్యాయ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావం నేరుగా గ్రామీణ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తుపై పడుతోంది.
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం:
గతంలో జీ తెలుగు నిర్వహించిన గురువందనం చర్చా వేదికగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే ఉంటే బోధనా నాణ్యత ఎలా సాగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఐదు వేర్వేరు తరగతులకు ఇద్దరు టీచర్లు సమర్థవంతంగా ఎలా బోధించగలరని ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచుతామని చెబుతూ.. క్షేత్రస్థాయిలో సరైన సిబ్బందిని కేటాయించకపోవడంపై పీఆర్‌టీయూ-టీఎస్ (PRTU-TS) తరఫున ఆయన గళమెత్తారు.
తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్:
ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా.. అలాగే 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించేలా జీవో 25ను సవరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు.. కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపైనే కాకుండా బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో నర్సరీ.. కేజీ తరగతులను ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టాలన్నారు.
ఏకోపాధ్యాయ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి.. ప్రతి తరగతి గదికి కచ్చితంగా ఒక టీచర్ ఉండేలా నియామకాలు జరపడంతోపాటు.. తెలంగాణ విద్యా వ్యవస్థ బలోపేతంపై TPTF రాష్ట్ర అధ్యక్షులు వై. అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి. అనిల్ కుమార్ పలు సందర్భాల్లో తమ డిమాండ్లను, సూచనలను ప్రభుత్వానికి వివరించారు. అటు ప్రీ ప్రైమరీ నుంచే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని.. ప్రతి తరగతి గదికి ఒక టీచర్‌ను నియమించాలి అని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (SGTU) రాష్ట్ర అధ్యక్షులు జి. మహిపాల్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం సైతం డిమాండ్ చేశారు. అటు STF రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు జీవో నెంబర్ 25 నుంచి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను తరగతికి ఒకరిని కేటాయించాలన్నారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు తపస్ విజ్ఞప్తి:
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ - TPUS) రాష్ట్ర శాఖ నేతలు గురువారం పాఠశాల విద్యాశాఖ గౌరవ కమిషనర్..డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కేవలం విద్యార్థుల నిష్పత్తిని మాత్రమే కాకుండా, తరగతులు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను కేటాయించేలా జీవో 25ను సవరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు వాడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్లపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు.
ప్రాథమిక విద్యా పరిరక్షణ కోసం వేర్వేరు సంఘాలు విడివిడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కంటేనూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒకే తాటిపైకి రావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విడివిడిగా ఒత్తిడి తేకుండా.. అన్ని సంఘాలు ఐక్యంగా ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కలిసి ఒక్కటై జీవో నంబర్ 25 సవరణ ఆవశ్యకతను ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా వివరించి.. సరైన ప్రాతినిధ్యం వహించడం ద్వారానే త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ లోకం స్పష్టం చేస్తోంది.
Also Read: