Govt School: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ చర్యలు చేపడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలోని జంబికుంట ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే ఉపాధ్యాయులు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోవడంతో విద్యార్థులు మధ్యలోనే ఇళ్లకు తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.
ఉపాధ్యాయుల గైర్హాజరుకు కాంప్లెక్స్ సమావేశమే కారణమా?
సోమవారం నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి సమావేశానికి హాజరయ్యే క్రమంలో పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులూ ఒకేసారి తాళం వేసి వెళ్లినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఒకరు బడిలోనే ఉండి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని, మరొకరు మాత్రమే సమావేశానికి వెళ్లాలని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ఇద్దరూ ఒకేసారి వెళ్లిపోవడం వల్ల పిల్లల చదువు దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువైందంటున్న గ్రామస్థులు:
ప్రభుత్వం ఉపాధ్యాయుల సమయపాలన కోసం ఆన్‌లైన్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం విద్యాశాఖ పర్యవేక్షణా లోపాన్ని వేత్తిచూపుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్వయంగా తనిఖీలు చేపట్టి పాఠశాలలు వేళకు నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఘటనపై విచారణకు ఎంఈఓ ఆదేశం:
ఈ ఉదంతంపై నిజాంపేట్ మండల విద్యాధికారి (ఎంఈఓ) రాములు స్పందిస్తూ.. జంబికుంట పాఠశాలను మధ్యలోనే మూసివేసిన ఉదంతం తన దృష్టికి రాలేదని తెలిపారు. కాంప్లెక్స్ సమావేశాలకు ఇద్దరు ఉపాధ్యాయులూ ఒకేసారి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, విధుల్లో అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.