Cold Waves Alert: తెలంగాణలో చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల రెండు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనివల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాహనదారులు బిగ్ అలర్ట్..
ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మఫ్లర్లు, స్వెట్టర్లు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు ఉదయం పూట బయటకు వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు. అత్యవసరమై వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కొమురం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
నిన్న కొమురం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 11.3, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.4, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 11.4, సిద్దిపేట్ జిల్లా నగునూర్‌లో 11.5, వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్‌లో 12.1, కామారెడ్డి జిల్లా డోంగిలో12.2, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.2, మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ లో 12.6 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో వేర్వేరు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.