Telangana Rain Alert: బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండానికి తోడు.. కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతుండటంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల 20.4 సెంటీ మీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిచే అవకాశాలున్నాయని తెలిపింది. మరికొన్ని చోట్ల 11.5 సెం.మీ నుంచి 20.4 సెం.మీలోపు అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక 25, 26 తేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అధికార యంత్రాంగం అప్రమత్తం..
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అలర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఒక ప్రాంతంలో వర్షం.. మరో ప్రాంతంలో కురవని వర్షం..
నిన్న హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు తూర్పు హైదరాబాద్ ప్రాంతమైన తార్నాక, ఉప్పల్, మల్లాపూర్, ఈసీఐఎల్, కీసర తదితర ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు పడలేదు.