Hyderabad: 'కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చెల్లని రూపాయి. విదేశాల్లోని చెల్లని రూపాయలను తీసుకొచ్చి సమ్మిట్ పెడితే ఒరిగేదేమిటి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అర్హతే లేదు. పొరపాటున ప్రధానమంత్రి అయితే దేశం ముక్కలవడం తథ్యం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మోదీ గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కాంక్షించే నాయకుడు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విమర్శించినా దేశ శ్రేయస్సు రీత్యా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలారా...మోదీని చూసి నేర్చుకోండి' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.
హైదరాబాద్ నారాయణగూడలోని కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. 'తెలంగాణ ప్రజలకు డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఏమిటో తెలుసు. నేను బరాబర్ మా గురువుల కాళ్లు మొక్కుతా. మీ లెక్క చెప్పులు ఎత్తుకుపోయే వాడిని కాదు. మీ లెక్క మంది కొంపలు ముంచే విలువలు మాకు మా గురువులు నేర్పలేదు' అని బండి సంజయ్ తెలిపారు. ‘మాకు సంస్కారం ఉంది. సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిన గురువుల కాళ్లు మొక్కుతాం. భవిష్యత్తులోనూ కాళ్లు మొక్కుతూనే ఉంటా’ అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
'నరేంద్రమోదీ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్ సమ్మిట్ పేరుతో మోదీని, ఆర్ఎస్ఎస్‌ను ఆడిపోసుకున్నప్పటికీ దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి వస్తే కలిశారు. మాకు రాజకీయాల కంటే దేశాభివృద్ధి ముఖ్యమని చాటి చెప్పిన నాయకుడు మోదీ. కాంగ్రెస్ నాయకులంతా మోదీని చూసి నేర్చుకోవాలి' అని బండి సంజయ్ సూచించారు. భారత్ సమ్మిట్ పేరుతో రూ.100 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? తెలంగాణకు నయాపైసా అయినా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు.
'దేశ వ్యతిరేకులను తీసుకొచ్చి పవిత్రమైన తెలంగాణ గడ్డను అపవిత్రం చేయడం తప్ప మీరు సాధించేదేమిటి? కష్టపడి ఉద్యమాలు చేసి బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకుంటే దేశ వ్యతిరేకులను తెలంగాణకు తీసుకొచ్చి రాష్ట్రం పరువు తీశారు. దేశమంతా ఇజ్జత్ పోతోంది' అని కాంగ్రెస్ తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేస్తామని పైసలివ్వలేదని.. ఈ సమ్మిట్‌కు ఖర్చు చేసిన నిధులను గిగ్ వర్కర్ల బోర్డుకు కేటాయిస్తే కనీసం వాళ్లకైనా మేలు జరిగేది కదా? అని తెలిపారు.
విదేశాలకు వెళ్లి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటైందని.. చివరకు దేశంలో ఉంటూ దేశ వ్యతిరేకులను తీసుకొచ్చి భారత్ పరువు తీస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇందిరాగాంధే ఆర్ఎస్ఎస్ గొప్ప సంస్థ అని కొనియాడినా రాహుల్ గాంధీ మాత్రం కళ్లు దొబ్బినట్లుగా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటాడు. 2014లో వందల కోట్లు ఖర్చు పెట్టడంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందంటాడు. నేనడుగుతున్నా 12 ఏళ్ల కిందట జరిగితే నాటి నుండి నేటి వరకు ఎందుకు ఆధారాలు బయటపెట్టలేదు?' అని రాహుల్ గాంధీని బండి సంజయ్ ప్రశ్నించారు.
'రాహుల్ గాంధీ కాసేపు ఈవీఎంలతో ఓడిపోయామని చెబుతాడు. కాసేపు సర్‌తో 14 కోట్ల ఓట్లు తీసేశారని అంటాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు? అంబేద్కర్ రాజ్యాంగంతో నడుస్తున్న భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్యం ఉన్న దేశమని అందరూ కొనియాడుతుంటే రాహుల్ గాంధీకి కనిపించడం లేదు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే సొంత పార్టీ నాయకులంతా నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా ఎవరూ ఊహించడం లేదని స్పష్టం చేశారు. 'పొరపాటున రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశాన్ని ముక్కలు చేస్తారు. దేశాన్ని తాకట్టు పెడతారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లెక్క మారుస్తాడు' అని బండి సంజయ్ తెలిపారు.