Dusshera Bonus: ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. దసరా, దీపావళి పండుగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. జీతానికి కన్నా ఎక్కువ బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్న విషయాన్ని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 'దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి' అని కొనియాడారు.
'సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నా. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 'దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నా. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నా' అని చెప్పారు.